కొడుకు కన్న కేటీఆర్ మిన్న

SMTV Desk 2017-07-10 14:15:00  ktr, riyadh, son nasayya, hyderabad, mellesh, job pipecompany, galf, jagithyala dist

హైదరాబాద్, జూలై 10 : ఇటీవల గల్ఫ్ లో చోటు చేసుకున్న ఘటనలో అకాల మరణం పొందిన ఓ వ్యక్తి మృతదేహాన్ని హైదరాబాద్ కు తీసుకొచ్చేందుకు, మంత్రి కేటీఆర్ స్పందించిన తీరుకు, ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. విషయంలోకి వెళితే జగిత్యాల జిల్లా కోడిమ్యాలకు చెందిన రామెని నర్సయ్య జీవనోపాధి కోసం రియాద్ వెళ్లాడు. ఓ పైపుల కంపెనీలో ఉద్యోగం చేస్తున్న ఆయన, ఇటీవల హఠాత్తుగా సొమ్మసిల్లి పడిపోయి చనిపోయారు. దీంతో తోటి ఉద్యోగుడైన మల్లేశ్ ఈ విషయాన్ని నర్సయ్య కుమారుడికి చేరవేసేందుకు చరవాణికి వందసార్లకు పైగా ఫోన్ చేసినా, అటు వైపు నుంచి ఎలాంటి స్పందన లేదు. కన్న కొడుకే పేగుబంధాన్ని మరిచి తండ్రి మృతదేహాన్ని స్వదేశానికి తెప్పించేందుకు ముందుకు రాలేకపోవడంతో, మల్లేశ్ ఫోనులో తెలంగాణ రాష్ట్ర ఐటీ, ఎన్నారై వ్యవహారాలశాఖ మంత్రి కేటీఆర్ ను సంప్రదించారు. విషయాన్ని తెలుసుకున్న కేటీఆర్ వెంటనే స్పందిస్తూ పూర్తి సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు స్థానిక అధికారులు, హైదరాబాద్ లోని ఉన్నతాధికారులు, రియాద్ లోని విదేశాంగశాఖ వర్గాలను ఏకకాలంలో సమన్వయపరిచారు. కుబుంబ సభ్యులకు ఆయన చివరి చూపు దక్కేలా చర్యలు తీసుకున్నారు. రియాద్ లోని కంపెనీ వివరాలను సైతం అక్కడ ఉన్న విదేశాంగశాఖ కార్యాలయానికి చేరవేసి నర్సయ్య మృతదేహాన్ని స్వగ్రామానికి రప్పించేందుకు చర్యలు చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వం అధికారులు వెంటనే మమ్మల్ని సంప్రదించి నర్సయ్య మృతదేహాన్ని చేరవేసేందుకు కావలసిన చర్యలు తీసుకున్నారని సహోద్యోగి మల్లేశ్ తెలిపారు. మంత్రి కేటీఆర్ కు సమాచారం ఇవ్వడమే ఆలస్యం, ఆయన దీనిపై వెంటనే స్పందించిన తీరుపై అందరూ హర్షం వ్యక్తం చేశారు.