చెన్నైతో తలపడేదెవరో..!

SMTV Desk 2018-05-25 12:03:44  kkr vs srh, ipl qualifier-2, ipl-11, csk

కోల్‌కతా, మే 25 : ఐపీఎల్-11 సీజన్ లో ఈ రోజు మరో ఉత్కంఠ పోరుకు రంగం సిద్ధమవుతుంది. తొలి క్వాలిఫయర్‌ పోరులో చెన్నై చేతిలో ఓటమిపాలైన హైదరాబాద్‌.. హ్యాట్రిక్‌ విజయాలతో ప్లే ఆఫ్‌ బెర్తు దక్కించుకోవడమే కాకుండా ఎలిమినేటర్‌లో రాజస్థాన్‌పై గెలిచి ఫైనల్‌ రేసులో నిలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) ఈ రోజు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లో నెగ్గిన జట్టు ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడనుంది. కోల్‌కతా వేదికగా రెండు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. బలాబలాల్లో విలియమ్సన్‌ సేన వైపే కొంత మొగ్గు ఉన్నా, సొంతగడ్డపై ఆడుతున్న దినేశ్‌ కార్తీక్‌ బృందాన్ని తక్కువ అంచనా వేయలేం. ఈ రెండు జట్ల నేపథ్యం లీగ్ ఆరంభం నుండి పూర్తిగా భిన్నం. వరుస విజయాలతో ఊపుమీదున్న సన్ రైజర్స్ జట్టు చివరిలో తడబడింది. తొలి 11 మ్యాచ్‌ల్లో 9 విజయాలు.. లీగ్‌ దశలో సన్‌రైజర్స్‌ తీరు అమోఘం. అలాంటిది ఆ తర్వాత ఆడిన 4 మ్యాచ్‌ల్లో (క్వాలిఫయర్‌-1 సహా) సన్‌రైజర్స్‌ ఓటమి పాలయ్యింది. హైదరాబాద్ జట్టుకు సారథిగా వ్యవహరిస్తున్న కెప్టెన్‌ విలియమ్సన్‌ అద్భుతంగా ఆడుతున్నా.. బౌలర్లు అద్వితీయంగా సత్తాచాటుతున్నా మిడిల్ ఆర్డర్ విఫలమవుతుంది. బ్యాటింగ్ లో మనీష్ పాండే, యూసుఫ్‌ పఠాన్‌ రాణిస్తే ఆ జట్టుకు తిరుగుండదు. ఇక బౌలింగ్ పరంగా సన్ రైజర్స్ జట్టు బలం కోసం ప్రత్యేకంగా చెప్పకర్లేదు. ఇక కోల్‌కతా జట్టులో తొలి నుండి పడుతూ లేస్తూ కొనసాగుతుంది. మొదట 11 మ్యాచ్‌ల్లో కేవలం 5 విజయాలతో ప్లేఆఫ్స్‌ బెర్తుకు దూరంగా ఉన్న కోల్‌కతా చివర్లో పుంజుకున్న తీరు అద్భుతం. వరుసగా 3 మ్యాచ్‌ల్లో గెలిచి ప్లేఆఫ్స్‌కు చేరుకున్న కోల్‌కతా.. ఎలిమినేటర్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ను చిత్తుచేసింది. దినేశ్‌ కార్తీక్‌ సారథ్యంలో జట్టు అన్ని విభాగాల్లో బాగా రాణిస్తోంది. ఈ జట్టులో సునీల్‌ నరైన్‌, ఆండ్రూ రసెల్‌ ఆల్‌రౌండ్‌ నైపుణ్యంతో ఆదరగోడుతున్నారు. వీరితో పాటు టాప్‌ ఆర్డర్‌లో క్రిస్‌ లిన్‌, ఉతప్ప.. మిడిలార్డర్‌లో కార్తీక్‌, నితీశ్‌ రాణా, శుభ్‌మన్‌ గిల్‌, ఉండనే ఉన్నారు. నాణ్యమైన ఆటగాళ్లతో కనిపిస్తున్న కోల్‌కతా.. మరో 2 సంచలనాలతో విజేతగా నిలిచినా ఆశ్చర్యపోనవసరం లేదు. మరి ఈ రోజు మ్యాచ్ లో గెలిచి ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడేదెవరో కొన్ని గంటల్లో తేలనుంది.