అద్దె గర్భం.. అమ్మతనంతో చెలగాటం..

SMTV Desk 2018-05-24 19:16:53  Surrogacy process in vishkapatnam, victim nagalakshmi, visakhapatnam, andhrapradesh

విశాఖపట్నం, మే 24 : నగరంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో అనుమతి లేకుండా సరోగసి పేరిట అద్దె గర్భాల అక్రమ వ్యాపారం నిర్వహిస్తున్న ఉదంతం బాధితురాలి ఫిర్యాదుతో బయటపడింది. తన అంగీకారం లేకుండా గర్భాన్ని అద్దెకు ఇచ్చారని దీనిపై ఆసుపత్రి యాజమాన్యాన్ని ప్రశ్నిస్తే రూ. 3లక్షలు ఇస్తామని తెలిపారని ఆరోపిస్తూ బాధితురాలు బుధవారం ఆందోళన బాట పట్టింది. ఆమెకు (పీవోడబ్ల్యూ) దళిత మహిళా సంఘాలు మద్దతుగా నిలిచాయి. బాధితురాలు నాగలక్ష్మి, మహిళా సంఘాల సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... భర్తతో గొడవపడి మధురవాడలో తల్లి వద్ద ఉంటున్న నేతల నాగలక్ష్మికి అదే కాలనీకి చెందిన కిలాడి ఉష ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించింది. నెల నెలా వృథాగా పోయే అండాలు తీసుకొని రూ.20వేలు ఇస్తారని అక్కయ్యపాలెంలోని పద్మశ్రీ ఆస్పత్రికి తీసుకొచ్చింది. కాగితాలపై సంతకాలు చేసిన తర్వాత ఆపరేషన్‌ థియేటర్‌లోకి తీసుకెళ్లి మత్తు మందు ఇచ్చారు. గంటన్నర తర్వాత నాగలక్ష్మికి తెలివి వచ్చాక ప్రశ్నించడంతో నీ కడుపులో రెండు పిండాలు పెట్టాం, 9 నెలలు మోయాలి. ఆ తర్వాత మూడు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి, ఆస్పత్రి డాక్టర్‌ సుధా పద్మశ్రీ రూ. 5వేలు నాగలక్ష్మి చేతిలో పెట్టింది. అనంతరం సెల్‌ఫోన్‌ లాక్కొని, ఆస్పత్రిలో బంధించారు. ఈ క్రమంలో బాధితురాలు అతికష్టంపై ఈ నెల 21న ఆస్పత్రి నుంచి తప్పించుకొని భర్త వద్దకు చేరుకొంది. తనకు జరిగిన అన్యాయంపై మహిళా సంఘాలతో కలసి అదే రోజు రాత్రి ఫోర్త్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రెండు రోజులు గడిచినా ఆస్పత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోకపోవడంతో ప్రగతిశీల మహిళా సంఘం ప్రతినిధులు ఎం.లక్ష్మి, ఎస్‌.వెంకటలక్ష్మి, యు.ఇందిర, ఈ.లక్ష్మి సాయంతో బాధితురాలి కుటుంబం బుధవారం పద్మశ్రీ ఆస్పత్రి ఎదుట ధర్నా నిర్వహించారు. అనుమతి లేకుండా సరోగసీ నిర్వహిస్తున్న ఆస్పత్రి నిర్వాహకులను అరెస్టు చేయాలని, బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.