ట్రంప్- కిమ్ సింగపూర్‌ సదస్సుపై సందిగ్థత..

SMTV Desk 2018-05-24 16:23:16   Donald Trump vs Kim Jong Un, america president, america vs north korea

వాషింగ్టన్, మే 24 ‌: గత రెండు నెలలుగా ఉప్పు-నిప్పులా వ్యవహరించి ప్రపంచ దేశాలను భయభ్రాంతులకు గురిచేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్- ఉత్తర కొరియా అధ్యక్షుడు కిం జోంగ్ ఉన్.. మధ్య జరగబోయే సింగపూర్‌ సదస్సుపై సందిగ్థత నెలకొంది. కొరియా ద్వీపాన్ని అణ్వస్త్రరహితంగా మార్చడమే లక్ష్యంగా వచ్చే నెల 12న ఉత్తర కొరియాతో జరిగే సింగపూర్‌ సదస్సుపై వచ్చేవారంలో నిర్ణయం తీసుకుంటామని అమెరికా ప్రకటించింది. అమెరికా, దక్షిణ కొరియా సంయుక్త సైనిక విన్యాసాలకు నిరసనగా సింగపూర్‌ సదస్సు నుంచి తప్పుకున్నట్లు ప్యాంగాంగ్‌ హెచ్చరించిన మరుసటి రోజే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. సింగపూర్‌ చర్చల గురించి వచ్చేవారం తెలుస్తుందని, అక్కడికి వెళితే ఉత్తరకొరియాకు గొప్ప విషయమవుతుందని శ్వేతసౌధంలో మీడియా ప్రతినిధులతో ట్రంప్‌ పేర్కొన్నారు. మరోవైపు అమెరికా, ఉత్తరకొరియా తొలి సదస్సుపై నీలినీడలు కమ్ముకున్న వేళ శ్వేతసౌధం మాత్రం సింగపూర్‌ ఏర్పాట్లపై ముందుకు సాగుతోంది. వింటర్ ఒలింపిక్స్ తర్వాత అమెరికా, ఉత్తర కొరియా మధ్య పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. ఈ మధ్యే దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జె ఇన్ డోనాల్డ్ ట్రంప్‌తో సమావేశమయ్యారు. తర్వాతే ట్రంప్ - కిమ్ భేటీపై స్పష్టత వచ్చింది. అటు అమెరికా.. ఇటు ఉత్తరకొరియాలో కాకుండా మధ్యలో సింగపూర్‌లో భేటీ కావాలని ట్రంప్ - కిమ్‌లు నిర్ణయించడం గమనార్హం.