తెలంగాణలో చరిత్ర తిరగరాస్తాం : ఎల్. రమణ

SMTV Desk 2018-05-24 15:51:42  l.ramana, ts tdp president l.ramana, mahanadu, tdp,

హైదరాబాద్, మే 24 ‌: తెలుగోడి ఆత్మగౌరవం ఢిల్లీలో తాకట్టు పెడుతుంటే తట్టుకోలేక ఆనాడు ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్. రమణ అన్నారు. టీడీపీ స్థాపించినప్పటి నుండి బడుగుల అభివృద్ది కోసమే పనిచేస్తోందని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జరుగుతున్న మహానాడులో రమణ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.." టీఆర్ఎస్ ప్రభుత్వంలో ధన దోపిడి పెరిగిపోయింది. రాష్ట్రంలో అసాంఘిక శక్తులు పేట్రేగిపోతున్నాయి. మహిళలకు కేబినేట్‌లో స్థానం ఇవ్వని ఏకైక ప్రభుత్వం కేసీఆర్‌దే. స్వార్థం కోసం కొందరు ఎమ్మెల్యేలు టీడీపీని వీడారు. చంద్రబాబు అండతో మళ్లీ తెలంగాణలో చరిత్ర తిరగరాస్తాం. జాతీయ స్థాయిలో చక్రం తిప్పే పార్టీ టీడీపీ అవుతుంది" అని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ పేరుతో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నట్లు రమణ తెలిపారు. కార్యకర్తల గౌరవం ఇముడింప చేసేలా పనిచేస్తాయని అయన స్పష్టం చేశారు. దేశంలో మళ్లీ సంకీర్ణ ప్రభుత్వాలు రాబోతున్నాయనడానికి కర్ణాటకనే నిదర్శమని పేర్కొన్నారు. సచివాలయానికి రాని ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆరేనని హేళన చేశారు. కేసీఆర్ పాలనలో కొన్ని వర్గాలకు మాత్రమే ప్రాధాన్యం దక్కుతుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో రావుల చంద్రశేఖర్‌రెడ్డి, పెద్దిరెడ్డి, పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు.