మొబైల్ కి బానిసవుతున్న పిల్లలు

SMTV Desk 2017-07-10 13:43:21  Children, are, slaves, to, mobile, phones

హైదరాబాద్, జూలై 10: తెలియని వయసులో పిల్లలకు తల్లిదండ్రులు మొబైల్ ని ఇవ్వడం వల్ల, పర్యవేక్షణ కొరవడడం వల్ల అది పిల్లల జీవితాలను నాశనం చేస్తుంది. చిన్న పిల్లల మెదడు చాలా సున్నితంగా ఉంటుంది. ఏదైనా వీడియోలు చూస్తే అది వారి మనసులో బలంగా నాటుకుపోతుంది. పదేళ్ల పిల్లలు సైతం ఒక్క క్లిక్ తోనే వాళ్లు కోరుకున్నది మొబైల్లో చూడగలుగుతున్నారు. స్నేహితులతో కలిసి అశ్లీల చిత్రాలను మొబైల్లో చూసి వాటికి బానిసలుగా మారి ఉద్రేకానికి లోనై బాలురు, బాలికలపై తమ వాంఛలు తీర్చుకోవడానికి ఎంతటి అఘాయిత్యానికైనా ఒడిగడుతున్నారు. ఇలాంటి ఘటనలు ఇటీవల కాలంలో తరచూ జరుగుతున్నాయి. పాతనగరంలో మహ్మద్‌ఖాన్‌పై లైంగిక దాడి చేసి అతన్ని హత్యచేసిన బాలుడిని(17) పోలీసులు విచారించగా అతడు అప్పటికే 15 మందిపై లైంగిక దాడి చేసినట్లు తెలిపాడు. పిల్లలు మొబైల్స్ కి అలవాటు పడటంతో వివిధ పాఠ్యాంశాలకు సంబందించిన ప్రాజెక్టు వర్క్ , హోంవర్క్ తదితర వాటిని అంతర్జాలంలో శోధించాల్సిందిగా ఉపాధ్యాయులే సూచిస్తున్నారు. ప్రస్తుతం ప్రతి ఒక్కరికి ఇంట్లో కంప్యూటర్ సాదారణంగా మారింది. చాలా మంది ఇళ్లల్లో కంప్యూటర్ తో పాటు అంతర్జాల సౌకర్యం కూడా ఉంటుంది. చాలా మంది తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగం చేసే వారైతే పిల్లలకు అడ్డుఅదుపు లేకుండా పోతుంది. ప్రతిరోజు వారితో కొంతసేపు గడపడం, వారేం చేస్తున్నారో తెలుసుకోవడం ద్వారా, ఇలాంటి వాటిని పిల్లల నుంచి దూరం చేయడానికి అవకాశం ఉంటుందని అంటున్నారు నిపుణులు. పిల్లలు మొబైల్స్ వాడడం వల్ల, ఇలాంటి పరిస్థితులే వారు వక్రమార్గంలో ప్రయాణించడానికి కారణమవుతోంది.