బీజేపీ, వైసీపీ నేతలపై మండిపడ్డ యనమల..

SMTV Desk 2018-05-24 12:50:55  AP CM, CHANDRABABU NAIDU, AP FINANCIAL MINISTER YANAMALA RAMAKRISHNUDU.

అమరావతి, మే 24 : ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రజలకు దూరం చేయాలని కుట్ర పన్నుతున్నారంటూ బీజేపీ, వైసీపీ నేతలపై రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. జాతీయ రాజకీయాలలో చంద్రబాబుకు ఉన్న ఇమేజ్ ఏంటో అందరికి తెలుసన్నారు. కేసుల మాఫీ కోసం కేంద్రం పెద్దల కాళ్లు పట్టుకోవడం వైసీపీ నేత జగన్‌ సంస్కృతి అని యనమల ఎద్దేవా చేశారు. బెంగళూరులో ప్రాంతీయ పార్టీలు, వామపక్షాల నేతలతో మాత్రమే చంద్రబాబు భేటీ అయ్యారని.. ఏపీకి జరిగిన అన్యాయంపై వారితో చర్చించారన్నారు. అయితే ఈ చర్చల్లో కాంగ్రెస్‌ పార్టీ లేదన్న విషయాన్ని గ్రహించాలన్నారు. జేడీఎస్‌ ఆహ్వానం మేరకే చంద్రబాబు ప్రమాణస్వీకారానికి వెళ్లారని, కాంగ్రెస్‌ పిలిస్తే వెళ్లలేదన్నారు. వేదికపై ఎదురైనప్పుడు అభినందించుకోవడం సంస్కారమని, భారతీయ సంస్కారాన్ని కూడా తప్పుబట్టడం సరికాదన్నారు. ఒకే వేదికపై ఎవరైనా ఎదురైతే పలకరించడం భారతీయ సంస్కారమని దానిని కూడా తప్పు పట్టడం భాజపా-వైకాపాల విష సంస్కృతి అని దుయ్యబట్టారు. కేంద్రంలో రాబోయేది భాజపాయేతర ప్రభుత్వమేనని.. ఇందుకు బెంగళూరులో జరిగిన ప్రాంతీయ పార్టీలు, వామపక్షాల భేటీయే ఇందుకు నాంది పలికిందని పేర్కొన్నారు.