నేడే సీఎంగా కుమారస్వామి ప్రమాణ స్వీకారం..

SMTV Desk 2018-05-23 12:41:22  kumara swami cm oath program, karnataka cm kumarswami, congress,-jds, ramesh kumar

కర్ణాటక, మే 23 : కర్ణాటకలో ముచ్చటగా మూడో సారి సంకీర్ణప్రభుత్వం కొలువు తీరనుంది. కాంగ్రెస్-జేడీఎస్ నేతృత్వంలో అక్కడ ప్రభుత్వం ఏర్పాటు కానుంది. సంకీర్ణ ప్రభుత్వ సారథిగా, రాష్ట్ర 24వ ముఖ్యమంత్రిగా జనతాదళ్‌(ఎస్‌) రాష్ట్ర అధ్యక్షుడు హెచ్‌.డి.కుమారస్వామి ఈ రోజు సాయంత్రం 4.30 గంటలకు ప్రమాణం చేయనున్నారు. తనతోపాటు కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డాక్టర్‌ పరమేశ్వర్‌ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నట్లు కుమారస్వామి వెల్లడించారు. ప్రమాణ స్వీకార వేదికకు రెండు వైపులా మూడువేల కంటే ఎక్కువ మంది ప్రత్యేక ఆహ్వానితులు ఆశీనులయ్యేందుకు కుర్చీలు అమర్చుతున్నారు. రెండు పార్టీలకు చెందిన లక్ష మంది కార్యకర్తలు, అభిమానులు ప్రమాణ స్వీకారోత్సవాన్ని వీక్షించేందుకు తగిన ఏర్పాట్లు చేశారు.గురువారం విధానసభలో బలపరీక్ష జరిగిన వారం తర్వాత మంత్రివర్గ విస్తరణ చేపడతామని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు వేణుగోపాల్‌ తెలిపారు. మంత్రివర్గంలో 22 స్థానాల్ని కాంగ్రెస్‌, 12 మంత్రి పదవులను జేడీఎస్ లు దక్కించుకొన్నాయని అయిన అన్నారు. సభాపతిగా మాజీ మంత్రి, మాజీ సభాపతి రమేశ్‌కుమార్‌ మరో మారు వ్యవహరిస్తారని వెల్లడించారు. ఉపసభాపతి, మరో ఉపముఖ్యమంత్రిగా జేడీఎస్‌ ఎమ్మెల్యేలు బాధ్యతల్ని చేపడతారని వ్యాఖ్యానించారు. ఈ రోజు జరగబోయే ప్రమాణస్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ, పశ్చిమ్‌బంగా సీఎం మమతా బెనర్జీ, బీఎస్పీ అధినేత్రి మాయావతి, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌యాదవ్‌, ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు నాయుడు, పలువురు కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు హాజరుకానున్నారు.