మహిళల ఐపీఎల్‌: సూపర్‌నోవాస్‌ విజయం

SMTV Desk 2018-05-22 18:23:20  IPL Womens Challenge, Supernovas ipl,Trailblazers ipl, mithali raj

ముంబై, మే 22 : మహిళా ఐపీఎల్ ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ నాయకత్వంలోని సూపర్ నోవాస్ మూడు వికెట్ల తేడాతో గెలుపొందింది. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌ అసలు సిసలు ఐపీఎల్‌ మజాను రుచి చూపించింది. తొలుత టాస్ నెగ్గిన సూపర్ నోవాస్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ కు దిగిన ట్రయల్‌బ్లేజర్స్‌ జట్టులో కెప్టెన్‌ స్మృతి మంధాన(14) నిరాశపరచగా.. సుజీ బేట్స్‌(32), దీప్తీ శర్మ(21)లు రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 129 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో సూపర్ నోవాస్ జట్టులో ఓపెనర్లు మిథాలీ రాజ్‌ (22), డానియెలె వ్యాట్‌ (24) శుభారంభం ఇచ్చారు. కానీ మిగతా బ్యాట్స్‌ఉమెన్‌ వెంటవెంటనే ఔట్‌ కావడంతో ఫలితం కోసం చివరి బంతి వరకూ వేచి చూడాల్సి వచ్చింది. ఈ దశలో సూపర్‌నోవాస్‌ గెలవాలంటే 6బంతుల్లో 4 పరుగులు కావాల్సి వచ్చింది. ఆ సమయంలో బంతి అందుకున్న ట్రయల్‌బ్లేజర్స్‌ బౌలర్‌ సుజీ బేట్స్‌(16/2) కట్టుదిట్టంగా బంతులు విసురుతూ..తమ జట్టును గెలిపించే ప్రయత్నం చేసింది. కానీ సూపర్‌నోవాస్‌ బ్యాట్స్‌ఉమెన్‌ ఎలిస్‌ పెర్రీ (13, నాటౌట్), పూజ వస్త్రకర్‌ (2, నాటౌట్) ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా చివరి బంతి వరకూ పోరాడి జట్టుకు అద్భుత విజయాన్ని అందించారు. దీంతో ఆ జట్టు 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ సుజీ బేట్స్‌ కు దక్కింది.