ఇందిరమ్మ ఇళ్ల అక్రమాలపై విచారణ షురూ!

SMTV Desk 2018-05-21 20:40:37  indiramma houses, indiramma house scam, hyderabad, ed, cid

హైదరాబాద్, మే 21 : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపేందుకు రాష్ట్ర విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయడంతోపాటు గృహనిర్మాణ శాఖ నుంచి అవసరమైన దస్త్రాలు సేకరించే పని మొదలుపెట్టారు. అనంతరం క్షేత్రస్థాయిలో విచారణ మొదలపెట్టనున్నారు. గత ప్రభుత్వాల హయంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో భారీగా అవకతవకలు జరిగాయని భావించిన తెరాస ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఐడీ విచారణకు ఆదేశించింది. సీఐడీ అధికారులు నమూనా ప్రాతిపదికన విచారణ జరిపారు. రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ, సీఐడీ ఆధ్వర్యంలో సంయుక్తంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందాలు 3వేల ఇళ్లను పరిశీలించి అనేక అక్రమాలు జరిగినట్లు గుర్తించాయి. వెయ్యి మంది లబ్ధిదారులు ఇళ్లు నిర్మించకుండానే డబ్బు గల్లంతు చేసినట్లు తెలిసి అధికారులు నివ్వెరపోయారు. మరో 1500 మంది పాత ఇళ్లనే చూపించి నిధులు మింగేశారు. మరో 350 ఇళ్లు పునాదుల దశలోనే ఉన్నప్పటికీ పూర్తయినట్లు దస్త్రాల్లో నమోదు చేయించి నిధులు స్వాహా చేశారని సీఐడీ తేల్చిచెప్పింది. నమూనా విచారణలోనే 95 శాతంపైగా అక్రమాలు జరిగాయని తేలడంతో అధికారులు కంగుతిన్నారు. ఇందులో గ్రామ సర్పంచులు మొదలు రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ అధికారుల అందరి ప్రమేయం ఉందని, అంతా కూడబలుక్కొనే అక్రమాలకు పాల్పడ్డారని సీఐడీ అధికారులు తేల్చిచెప్పారు. రాబోయే వారం రోజుల్లో విజిలెన్స్‌ విచారణ మరింత జోరుగా సాగనుంది.