ప్లేఆఫ్స్‌కు చేరిన కేకేఆర్

SMTV Desk 2018-05-20 11:32:52  kkr vs srh, chris lynn, ipl, ipl play off

హైదరాబాద్, మే 20 : ఐపీఎల్ -11 సీజన్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించింది. శనివారం సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో కేకేఆర్ జట్టు 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. తద్వారా ఈ సీజన్ లో ప్లే ఆఫ్స్ కు చేరిన మూడో జట్టుగా నిలిచింది. మొత్తంగా ఎనిమిదో విజయం అందుకున్న కోల్‌కతా వేరే మ్యాచ్‌ల ఫలితాలపై ఆధారపడకుండా దర్జాగా ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లింది. ఇక చివరి బెర్తు కోసం ముంబై, రాజస్థాన్, పంజాబ్ జట్లు పోటీ పడతున్నాయి. ఆ ఒక్క స్థానం ఎవరిదీ అనే విషయం ఈ రోజు తేలనుంది. తొలుత టాస్ నెగ్గిన సన్ రైజర్స్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. హైదరాబాద్ జట్టులో శిఖర్‌ ధావన్‌ (50) అర్ధ సెంచరీ సాధించగా, కేన్‌ విలియమ్సన్‌ (17 బంతుల్లో 36), శ్రీవత్స్‌ గోస్వామి (35) రాణించారు. దీంతో హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. కేకేఆర్ జట్టులో ప్రసిధ్‌ కృష్ణ 30 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం కోల్‌కతా 19.4 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. క్రిస్‌ లిన్‌ (55) అర్ధ సెంచరీతో పాటు రాబిన్‌ ఉతప్ప (45) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. చివర్లో కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్‌ (26 నాటౌట్‌) ఒత్తిడిలో మరో కీలక ఇన్నింగ్స్‌ ఆడి గెలిపించాడు. ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు క్రిస్ లీన్ కు దక్కింది.