నా హీరోని విలన్ చేశా : విశాల్

SMTV Desk 2018-05-19 16:59:39  irumbutirai, hero vishal, arjun, thanks meet.

చెన్నై, మే 19 : పి.ఎస్ మిత్రన్‌ దర్శకత్వంలో విశాల్, సమంత జంటగా నటించిన చిత్రం "ఇరుంబుతిరై". ఇటీవల రిలీజ్ అయిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించి సూపర్‌హిట్‌గా నిలిచింది. విశాల్‌ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్‌పై విశాల్‌ స్వయంగా నిర్మించిన ఈ చిత్రంలో యాక్షన్‌కింగ్‌ అర్జున్‌ విలన్‌ పాత్రలో అదరగొట్టగా, సమంత సైకాలజీ డాక్టర్‌గా అలరించింది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ సినిమా సక్సెస్‌ మీట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా అర్జున్ మాట్లాడుతూ.. "2000 సంవత్సరంలో నాకు బాగా తెలిసిన వ్యక్తి ఒక కుర్రాడిని నా దగ్గరకు తీసుకొచ్చి పని నేర్పించమన్నారు. అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా తీసుకున్నాను. కొన్నాళ్లకి ఆ కుర్రాడిలో టెక్నీషియన్‌ కంటే మంచి నటుడు కనిపించాడు. వాళ్ల నాన్నకి అదే చెప్పాను. తరువాత నటుడిగా ఎదిగాడు. నిర్మాతగా మారాడు. నడిగర్‌ సంఘంలో గెలిచాడు. నిర్మాతల మండలికి అధ్యక్షుడు. నా శిష్యుడి ఎదుగుదల చూసి గర్వపడుతున్నా" అంటూ వెల్లడించారు. అలాగే విశాల్‌ మాట్లాడుతూ... "విలన్‌ పాత్రకి ముందు ఆర్యని అనుకున్నాం. ఎందుకో ఆర్య నటించడానికి ఇష్టపడలేదు. తరువాత దర్శకుడు మిత్రన్‌ నాతో అర్జున్‌ సార్‌ నటిస్తే బాగుంటుందని చెప్పారు. వెంటనే నీకు నువ్వుగా అడుగుతానంటే అడుగు, నాకు సంబంధం లేదని చెప్పాను. ఎందుకంటే నా హీరోని విలన్‌గా నటించమని నేనెలా అడుగుతాను. కథ విన్నాక అర్జున్‌ ఒప్పుకున్నారు. దర్శకుడు ఆ మాట చెప్పగానే చాలా ఆనందపడ్డాను" అని తన గురువుపై అభిమానాన్ని చాటుకున్నారు.