కర్ణాటక రంగస్థలం : విజేత ఎవరు..?

SMTV Desk 2018-05-19 11:31:23  #karnatakafloortest, bjp, congress-jds,

బెంగళూరు, మే 19 : గత కొన్ని రోజులుగా క్షణ క్షణంకు మారుతున్న కర్ణాటక సమీకరణాలకు ఈ రోజు ముగింపు పడనుంది. వ్యూహాలు, ప్రతివ్యూహాల కసరత్తు అనంతరం క్యాంప్‌ రాజకీయాలు మరింత వేడిగా మారాయి. కర్ణాటక పీఠం దక్కించుకోవడం అటు బీజేపీకి, ఇటు కాంగ్రెస్‌కు ప్రతిష్టాత్మకంగా పరిణమించింది. దీంతో ఎవరు వ్యూహాలు పై చేయి సాధించనున్నాయి. కర్ణాటక పీఠం ఎవరికి దక్కనుంది? విజేత ఎవరు? ఇపుడిదే పెద్ద చర్చ‌. ఈ రోజు(శనివారం) సాయంత్రం నాలుగు గంటలకు జరగనున్న బలపరీక్ష నేపథ్యంలో బెంగళూరు విధాన సౌధ వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు. బల నిరూపణ కోసం యడ్యూరప్ప సర్కారుకు గవర్నర్‌ ఇచ్చిన 15 రోజుల గడువును పక్కనపెడుతూ శనివారం సాయంత్రం 4 గంటలకు బలపరీక్ష జరపాలని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. బలపరీక్షలో ఎలాగైనా నెగ్గేందుకు బీజేపీ తన విశ్వప్రయత్నాలు చేస్తోంది. బలపరీక్ష నిరూపణ సమయం దగ్గర పడుతున్న కొద్దీ బీజేపీలో కొత్త ధీమా కనిపిస్తోంది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం 10 నుంచి 15మంది కాంగ్రెస్‌-జేడీఎస్‌ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారంటూ బీజేపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగా కాంగ్రెస్‌-జేడీఎస్‌కు చెందిన పదిమంది ఎమ్మెల్యేలను తనవైపుకు తిప్పుకోవడం, మరోవైపు 14మంది ఎమ్మెల్యేలు గైర్హాజరు అయ్యే విధంగా చేసేందుకు పావులు కదుపుతోంది. మరోవైపు సీనియర్‌ సభ్యులను పక్కన పెట్టి ప్రొటెం స్పీకర్‌గా బోపయ్య ఎన్నికపై కాంగ్రెస్‌ నిరసన వ్యక్తం చేయడంతో పాటు సుప్రీంను ఆశ్రయించింది. దీనిపై ఉదయం 10. 30 నిమిషాలకు సుప్రీంలో విచారణ జరిగింది. బలపరీక్ష చేపట్టేందుకు ప్రొటెం స్పీకర్‌ బోపయ్యకే అత్యున్నత న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. మే 12న కర్ణాటకలోని 222 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 104 సీట్లతో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించగా.. కాంగ్రెస్‌ 78, జేడీఎస్‌ 38 స్థానాలు, ఇతరులు 02 స్థానాలు సాధించాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 112 స్థానాలు అవసరం కాగా.. 117 ఎమ్మెల్యేల బలమున్న తమను కాదని, అప్రజాస్వామికంగా గవర్నర్‌ బీజేపీని ఆహ్వానించారనేది కాంగ్రెస్‌–జేడీఎస్‌ కూటమి ఆరోపించిన విషయం విదితమే.