దేవెగౌడకు రాహుల్ క్షమాపణలు చెప్పారంటా..!

SMTV Desk 2018-05-18 15:06:19  rahul gandhi, devgowda, karnataka verdict, congress, bip

బెంగళూరు, మే 18 : రాజకీయాల్లో శాశ్వత శత్రువులు.. శాశ్వత మిత్రులు ఉండరని చాలా మంది అంటారు. ఇప్పుడు కర్ణాటకలో జరుగుతున్నా పరిణామాలు చూస్తే అది నిజమనే అనిపిస్తుంది. ఎన్నికల ముందు వరకు కాంగ్రెస్- జేడీఎస్ నేతలు ఒకరి మీద ఒకరు పరస్పరం తీవ్ర విమర్శలు చేసుకున్నారు. ఇప్పుడు అధికారం కోసం కూటమిగా ఏర్పడ్డారు. అంతే కాదు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మాజీ ప్రధాని, జేడీఎస్‌ నేత దేవెగౌడ కు క్షమాపణలు చెప్పారంటా. ప్రస్తుతం కర్ణాటకలో హంగ్‌ ఏర్పడిన నేపథ్యంలో జేడీఎస్‌ మద్దతు ఎంత అవసరమో కాంగ్రెస్‌, భాజపాకు తెలిసినంతగా మరెవరికీ తెలియదు. ఆ రెండు పార్టీల నేతలు శుక్రవారం మాజీ ప్రధాని, జేడీఎస్‌ నేత దేవెగౌడ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. "ఆయన ఆరోగ్యం, జీవితం బాగుండాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను" అని ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా దేవెగౌడకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. "ఆయన ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను" అని ట్వీట్ చేశారు. అయితే జేడీఎస్‌తో సంబంధాలు బలోపేతం చేసే ఉద్దేశంతో గురువారం రాహుల్‌.. దేవెగౌడతో కొద్దిసేపు మాట్లాడారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ జేడీఎస్ మీద విమర్శనాస్త్రాలు సంధించిన విషయం తెలిసిందే. భాజపాకు జేడీఎస్‌ టీమ్ బి పార్టీ లాంటిదని ఎద్దేవా చేశారు. జనతాదళ్(సెక్యులర్‌)ను కాస్తా జనతాదళ్(సంఘ్‌ పరివార్‌) అని తీవ్రంగా విమర్శించారు. అయితే ఆ వ్యాఖ్యలపై దేవెగౌడకు రాహుల్‌ సారీ చెప్పినట్లు పార్టీ వర్గాల సమాచారం.