బాసిల్‌ బౌలింగ్ ను బాదేశారు..

SMTV Desk 2018-05-18 14:37:20  basil thampi, srh bowler thampi, srh vs rcb, ipl

బెంగళూరు, మే 18 : నాలుగు ఓవర్లు... 70 పరుగులు.. నిన్న మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు బౌలర్ బాసిల్ థంపి గణాంకాలు. ఐపీఎల్-11 సీజన్ బౌలింగ్ పరంగా చూస్తే హైదరాబాద్ జట్టు బలమైనది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కానీ వారి బౌలింగ్ ను రాయల్ చాలెంజర్స్‌ బెంగుళూరు జట్టు తుత్తునియులు చేసింది. చిన్నస్వామి స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్- రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు ల మధ్య గురువారం జరిగిన పోరులో కోహ్లి సేన నిర్ణీత 20 ఓవర్లలో 218 పరుగులు చేసింది. ఇక సన్‌ యువబౌలర్‌ బాసిల్‌ థంపి ఈ మ్యాచ్‌లో ఏకంగా 70 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్‌గా చెత్త రికార్డు నమోదు చేశాడు. భువనేశ్వర్‌ స్థానంలో తుది జట్టులోకి వచ్చిన థంపి.. వేసిన నాలుగు ఓవర్లలో 19,18,14,19 పరుగులు ఇచ్చాడు. దీంతో ఇప్పటికి వరకు ఇషాంత్‌ శర్మ పేరు మీద ఉన్న ఈ చెత్తరికార్డును అధిగమించాడు. 2013 సీజన్‌లో ఇషాంత్‌ 66 పరుగులిచ్చాడు. ఇప్పటి వరకు ఇదే అత్యధికం కాగా తాజాగా థంపి దీన్ని బ్రేక్ చేశాడు. ఇషాంత్‌ తర్వాత ఉమేశ్‌ యాదవ్‌ (0/65), సందీప్‌ శర్మ(1/65), వరుణ్‌ ఆరోన్‌ (2/63), అశోక్‌ దిండా(0/63)లు అత్యధిక పరుగులిచ్చిన జాబితాలో ఉన్నారు. ఏబీ డివిలియర్స్‌ (69), మొయిన్‌ అలీ (65) అద్భుత భాగస్వామ్యం, గ్రాండ్‌హోమ్‌ (40), సర్ఫరాజ్‌ ఖాన్‌ (22 నాటౌట్‌)ల మెరుపు ఇన్నింగ్స్‌లతో బెంగళూరు 218 పరుగులు భారీ స్కోర్‌ నమోదు చేసింది. ఈ లక్ష్య చేధనలో ఏమాత్రం తడబడని సన్‌రైజర్స్‌ చివరి వరకు పోరాడి ఆకట్టుకుంది. ఆ జట్టు సారథి కేన్‌ విలియమ్సన్‌ (81), మనీశ్‌ పాండే (62నాటౌట్‌) తుదివరకు పోరాడినా విజయం బెంగళూరునే వరించింది.