క్లైమాక్స్ కు కర్ణాటక రాజకీయం... కమల దళం నెగ్గుతుందా..!

SMTV Desk 2018-05-18 13:19:10  karnataka floor test, bjp, congress- jds, yeddyurappa

కర్ణాటక, మే 18 : కర్ణాటకలో కొన్ని రోజులుగా జరుగుతున్నా పరిణామాలు రోజురోజుకి రసవత్తరంగా మారుతున్నాయి. అనేక ఎత్తులు, పాటి ఎత్తుల అనంతరం ఇప్పుడు సీన్ క్లైమాక్స్ కు చేరుకుంది. కన్నడ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అత్యధికంగా బీజేపీ 104 స్థానాలు సాధించగా.. కాంగ్రెస్ 78, జేడీఎస్ 38, ఇతరులు 02 స్థానాలు దక్కించుకొన్నారు. గవర్నర్‌ 104 స్థానాలు గెలుచుకొని అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీకు ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ రాష్ట్ర శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన యడ్యూరప్ప కర్ణాటక 23వ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. ఫలితాల తర్వాత కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు ప్రయత్నాలు ఆరంభించిన... గవర్నర్ బీజేపీకు అవకాశం కల్పించారు. శాసనసభలో బల నిరూపణకు 15రోజుల గడువు ఇచ్చారు. దీంతో మండిపడ్డ కాంగ్రెస్ యడ్యూరప్ప ప్రమాణస్వీకారాన్ని నిరసిస్తూ కాంగ్రెస్‌-జేడీఎస్‌ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారించింది. ఈ వ్యవహారం ఓ కొలిక్కి రావాలంటే రేపే బలపరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. మరి ఇప్పుడు 104 స్థానాలున్నా కమల దళం తమ ఆధిపత్యాన్ని ఎలా నిరుపించుకుంటుందో అని అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బీజేపీ ప్రభుత్వం విశ్వాస పరీక్షలో నెగ్గాలంటే 112 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. అయితే తమకు 114 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. అలా కాకుండా బ‌ల‌నిరూప‌ణ స‌మ‌యంలో కాంగ్రెస్ కానీ.. జేడీఎస్ ఎమ్మెల్యేలు కానీ గైర్హాజ‌రు అయ్యేలా చూస్తే య‌డ్యూర‌ప్ప ప్ర‌భుత్వం విశ్వాస ప‌రీక్ష‌లో సులభంగా నెగ్గుతుంది. ప్రస్తుతం కాంగ్రెస్-జేడీఎస్ ఎమ్మేల్యేలు హైదరాబాద్ లో ఉన్నారు. ఈ కూటమి ఎమ్మేల్యేలు పార్టీ మారాకుండా నేతలు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరో వైపు బలపరీక్షలో నూరు శాతం విజయం సాధిస్తామని యడ్యూరప్ప ఆశాభావం వ్యక్తం చేశారు. ఒక వేళా బీజేపీ బలపరీక్షలో నెగ్గకపోతే 3రోజుల ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప చరిత్రలో నిలిచిపోనున్నారు. ఒకవేళ విజయం సాధిస్తే దక్షిణాదిలో పాగా వేయాలన్నకాషాయ దళం కల నిజమైనట్టే. మరి ఏం జరుగుతుందో కొన్ని గంటల్లో తేలనుంది.