ఉత్కంఠ పోరు.. బెంగుళూరుదే జోరు

SMTV Desk 2018-05-18 11:10:34  srh vs rcb, ab deviliers, ipl, moin ali

బెంగుళూరు, మే 18 : బెంగుళూరు చిన్నస్వామి స్టేడియంలో పరుగుల సునామీ పారింది. ఏకంగా 422 పరుగులు నమోదైన ఈ మ్యాచ్‌లో చివరకు రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుదే పైచేయి అయింది. డూ ఆర్ డై మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు జూలు విదిల్చింది. సన్ రైజర్స్ హైదరాబాద్ తో ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో 14 పరుగుల తేడాతో కోహ్లి సేన విజయం సాధించి.. ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. తొలుత టాస్ నెగ్గిన సన్ రైజర్స్ జట్టు సారథి కేన్ విలియంసన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఇప్పటికి ఆరు విజయాలు సాధించిన బెంగళూరు తన ఆఖరి మ్యాచ్‌ను 19న రాజస్థాన్‌తో ఆడాల్సివుంది. ప్లేఆఫ్స్‌ అవకాశాలు నిలవాలంటే ఆ మ్యాచ్‌లోనూ నెగ్గాలి. బ్యాటింగ్ కు దిగిన ఆర్సీబీ జట్టులో డివిలియర్స్‌ (69; 39 బంతుల్లో 12×4, 1×6), మొయిన్‌ అలీ (65; 34 బంతుల్లో 2×4, 6×6)మెరుపులు మెరిపించగా... చివరిలో (40; 17 బంతుల్లో 1×4, 4×6), సర్ఫ్‌రాజ్‌ ఖాన్‌ (22 నాటౌట్‌; 8 బంతుల్లో 3×4, 1×6) విరుచుకుపడడంతో మొదట బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 218 చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన హైదరాబాద్ జట్టు భారీ లక్ష్యాన్ని శక్తివంచన లేకుండా చివరి వరకు పోరాడింది. తొలి వికెట్‌కు హేల్స్‌ (37)తో 47 పరుగులు జోడించిన ధావన్‌ (18) ఆరో ఓవర్లో నిష్క్రమించాక క్రీజులోకి వచ్చిన విలియమ్సన్‌ (81) ఎడాపెడా ఫోర్లు, సిక్స్‌లతో పరుగుల వరద పారించాడు. హేల్స్‌ ఔటైనా మనీష్‌ పాండే (62) అండతో విలియమ్సన్‌ రెచ్చిపోయాడు. ఒక దశలో గెలుపు వైపు సాగిన హైదరాబాద్ జట్టు చివరిలో బెంగుళూరు బౌలర్లు బోల్తా కొట్టించారు. దీంతో ఆ జట్టు 20 ఓవర్లో మూడు వికెట్లు కోల్పోయి 204 పరుగులు చేసి ఓటమి పాలయ్యింది. ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ ఏబీడీ కు దక్కింది.