అర్ధరాత్రి ఓ కామాంధుడి అఘాయిత్యం..

SMTV Desk 2018-05-16 11:38:07  guntur, sexual harassment, old guntur news.

గుంటూరు, మే 16 : అర్ధరాత్రి ఓ కామాంధుడు మైనర్ బాలికపై అత్యాచారానికి ఒడికట్టాడు. పాతగుంటూరు బాలాజీనగర్‌లోని ఓ ప్రాంతంలో ఉండే బాలిక రెండో తరగతి చదువుతోంది. ఆ బాలికపై అదే ప్రాంతానికి చెందిన రఘు అనే యువకుడు ఇంట్లో ఒంటరిగా ఉండటాన్ని గమనించి ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఆ బాలిక వెనకనే బిగ్గరగా కేకలు వేస్తూ బయటకు పరుగు తీసింది. ఇది గమనించిన స్థానికులు కోపోద్రిక్తులై ఆ యువకుడిని పట్టుకోవడానికి వెంటపడ్డారు. ఆ యువకుడు అక్కడి నుంచి పారిపోయి పోలీసుస్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు పెద్ద ఎత్తున రోడ్డుపైకి చేరుకొని ఆందోళనకు దిగారు. అంతేకాదు ఆ యువకుడిని తమకు అప్పగించాలంటూ డిమాండ్ చేశారు. ఆగ్రహావేశాలతో ఉన్న నిరసనకారులు నూతనంగా నిర్మించిన ఆదర్శ పోలీసుస్టేషన్‌పై రాళ్లవర్షం కురిపించగా దాని అద్దాలు పగిలాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని నిలువరించేందుకు లాఠీఛార్జి చేశారు. రబ్బరు బుల్లెట్లను ప్రయోగించారు. రాళ్లదాడి ఆపకపోవడంతో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.