ఆ ఇద్దరు ఎవరు..?

SMTV Desk 2018-05-15 21:25:57  #karnataka elections, congress, bjp, jds, others

బెంగళూరు, మే 15 : కర్ణాటక ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. ఇప్పుడు ఎవరు ముఖ్యమంత్రి అవుతారోని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫలితాల్లో అత్యధికంగా బీజేపీ 104 స్థానాలు సాధించగా.. కాంగ్రెస్ 78, జేడీఎస్ 38, ఇతరులు 02 స్థానాలు దక్కించుకొన్నారు. ఎవరికీ పూర్తి మెజార్టీ రాకపోవడంతో రాజకీయ పరిణామాలు ఉత్కంఠగా మారిన సంగతి తెలిసిందే. కమలదళం అతి పెద్ద పార్టీగా అవతరించినప్పటికీ మ్యాజిక్‌ ఫిగర్‌ను చేరుకోకపోవడంతో కాంగ్రెస్‌, జేడీఎస్‌ కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమయ్యాయి. మరో వైపు అధికారం కోసం బీజేపీ కూడా తెగ ప్రయత్నాలు చేస్తాయి. అసలు మూడు ప్రముఖ పార్టీలు హోరాహోరీగా తలపడ్డ ఎన్నికల బరిలో విజయ దుందుభి మోగించిన ఆ ఇద్దరు ఎవరన్న ఆసక్తీ సర్వత్రా నెలకొంది. అందులో ఒకరు స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేసిన హెచ్‌ నగేష్‌. ముల్‌బాగల్‌ నియోజవర్గం నుంచి స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేసిన హెచ్‌ నగేష్‌ జేడీఎస్‌పై విజయం సాధించారు. కాగా తాను కాంగ్రెస్‌ వ్యక్తినని.. కాంగ్రెస్‌కు మద్దతిస్తున్నానని ఆయన ప్రకటించారు. మరో నియోజకవర్గం రణెబెన్నూర్‌ నుంచి కేపీజేపీ పార్టీ అభ్యర్థి ఆర్‌ శంకర్‌ గెలుపొందారు. ఈయన కూడా కాంగ్రెస్‌కే మద్దతిస్తున్నట్లు వెల్లడించారు. గత ఎన్నికల్లో ఆర్‌ శంకర్‌పైన కాంగ్రెస్‌ అభ్యర్థి గెలుపొందగా ఇప్పుడు శంకర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి కృష్ణప్ప భీమప్పపై విజయం సాధించారు.