ఉత్కంఠగా మారిన ప్లేఆఫ్‌ రేస్..

SMTV Desk 2018-05-15 19:03:50  ipl play off, ipl teams, rcb, srh, csk

హైదరాబాద్, మే 15 : ఐపీఎల్ -11 సీజన్ ఈ సారి రసవత్తరంగా మారింది. సాధారణంగా ఐపీఎల్ లో ఈదశకి వచ్చే సరికి రెండు మూడు జట్లు దాదాపు ప్లేఆఫ్‌ రేసు నుంచి తప్పుకొనే స్థితిలో ఉండేవి. కానీ ఈసారి పరిస్థితి ఉత్కంఠగా మారింది. కేవలం ఒక్క ఢిల్లీ (12 మ్యాచ్‌లో 9 ఓటములు) మాత్రమే రేసు నుంచి వైదొలిగింది. మిగతా ఏడు జట్లలో రెండు (సన్‌రైజర్స్‌, చెన్నై) ఇప్పటికే ప్లేఆఫ్‌ బెర్తులు ఖరారు చేసుకున్నాయి. మిగిలిన రెండు బెర్తుల కోసం ఐదు జట్ల మధ్య హోరా హోరీ పోటీ నెలకొంది. కొన్ని రోజుల కిందటి వరకు ముంబయి, బెంగళూరు, రాజస్థాన్‌ పేలవ ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానానికి పోటీ పడుతూ కనిపించాయి. కొంచెం ఆలస్యంగా పుంజుకున్న ఈ మూడు జట్లూ ప్లేఆఫ్‌ రేసులోకి దూసుకొచ్చాయి. మరోవైపు ఆరు మ్యాచ్‌ల్లో ఐదు విజయాలతో ఒకప్పుడు తిరుగులేని స్థాయిలో ఉన్న పంజాబ్‌.. అనూహ్య పరాజయాలతో వెనుకబడింది. ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్న కోల్‌కతాకు.. ఏడో స్థానంలో ఉన్న బెంగళూరుకు తేడా ఒక్క విజయమే. కాబట్టి మ్యాచ్‌ మ్యాచ్‌కూ సమీకరణాలు మారిపోతాయి. దీంతో ప్లేఆఫ్ కు చేరే మిగతా జట్ల కోసం చివరి వరకు వేచి చూడక తప్పదు.