రుడాభాయ్‌ వాలాను కలిసిన యడ్యూరప్ప, కుమారస్వామి

SMTV Desk 2018-05-15 18:07:07  #karnataka elections kumara swami, B. S. Yeddyurappa, jds

బెంగళూరు, మే 15 : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి యడ్యూరప్ప గవర్నర్‌ విజుభాయ్‌ రుడాభాయ్‌ వాలాను కలిశారు. తమకు ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని ఆయనను కోరారు. ఫలితాల్లో అత్యధికంగా బీజేపీ 104 స్థానాలు సాధించగా.. కాంగ్రెస్ 78, జేడీఎస్ 38, ఇతరులు 02 స్థానాలు దక్కించుకొన్నారు. దీంతో జేడీఎస్‌ మూడో స్థానంలో నిలిచి కింగ్‌మేకర్‌గా మారింది. కాంగ్రెస్‌ మద్దతుతో జేడీఎస్‌ కూడా ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని గవర్నర్‌ను కోరనుండటంతో ఉత్కంఠ నెలకొంది. జేడీఎస్‌కు తాము సంపూర్ణ మద్దతు ఇస్తామని కాంగ్రెస్‌ చేసిన ప్రకటనతో రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అటు భాజపా.. ఇటు కాంగ్రెస్‌తో కలిసి జేడీఎస్‌ ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నాయి. కాంగ్రెస్‌కు 78 స్థానాలు రావడంతో ప్రభుత్వం ఏర్పాటుచేసే అవకాశం లేకపోవడంతో చివరకు జేడీఎస్‌కు మద్దతు ప్రకటించింది. జేడీఎస్‌ అధినేత కుమారస్వామి కూడా గవర్నర్‌ను కలిశారు. గవర్నర్ ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నట్లు ఆ పార్టీ నేతలు మీడియాతో తెలిపారు.