కన్నడ నాట... కుర్చీ ఆట..

SMTV Desk 2018-05-15 17:23:45  #karnatakaelections, congress, jds, bjp, kumara swami

బెంగుళూరు, మే 15 : కొద్దిరోజులుగా దేశ వ్యాప్తంగా ఆసక్తిగా మారిన కర్ణాటక ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ముందు బీజేపీ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు దిశగా సాగిన... తర్వాత సమీకరణలు మారి హంగ్ వైపు దారి తీశాయి. దీంతో కొన్ని సర్వేలు చెప్పిన మాదిరి జేడీఎస్ పార్టీ కింగ్ మేకర్ పాత్ర పోషించనుంది. అయితే ఏ పార్టీకి తగినంత మెజారిటీ రాలేదు కనుక ఎవరు సీఎం కుర్చీని అధిరోహిస్తారని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఓ వైపు 104 స్థానాల్లో గెలుపొంది బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరించింది. మరో వైపు 78 స్థానాల్లో విజయం సాధించిన కాంగ్రెస్, 38 సీట్లు గెలిచిన జేడీఎస్ తో ప్రభుత్వం ఏర్పాటకు ప్రయత్నాలు చేస్తుంది. అయితే ఇక్కడ ఎవరికి సీఎం పగ్గాలు అప్పగించాలన్న అంశం పూర్తిగా గవర్నర్‌ చేతుల్లో ఉంది. గతంలో ఉన్న రాజ్యాంగ సంప్రదాయాలను అనుసరించి ఎక్కువ స్ధానాలు సాధించిన పార్టీకి ప్రభుత్వ బాధ్యతలు అప్పగించి శాసనసభ విశ్వాసాన్ని నిరూపించేందుకు నిర్ణీత గడువు ఇవ్వాలని రాజ్యాంగనిపుణులు చెబుతున్నారు. రాజ్యాంగా సంప్రదాయం ప్రకారం... >> మెజారిటీ స్థానాలు సాధించిన బీజేపీకు రాష్ట్రప్రథమ పౌరుడు అవకాశం ఇవ్వాల్సివుంటుంది. యడ్యూరప్పకు పగ్గాలు అప్పగించి నిర్ణీత సమయంలోగా సభ విశ్వాసాన్ని పొందాలని గవర్నర్‌ ఆదేశించవచ్చు. అయితే జేడీఎస్‌-కాంగ్రెస్‌లు తమను మొదట పిలవాలని పట్టుబట్టితే దానికి అంతగా ప్రాముఖ్యత ఉండదు. >> మొదటి పిలుపు అధిక స్థానాలు సాధించిన పార్టీగా భాజపాకు అందాలన్నది రాజకీయనిపుణుల ఏకాభిప్రాయం ఇందులో ఎటువంటి సందేహాలకు తావులేదు. >> ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే... ఎన్నికలకు ముందు కుదిరిన కూటములకు విలువ ఉంటుంది. ఎన్నికల తర్వాత ఏర్పడిన పొత్తులను అంతగా పరిగణలోకి తీసుకోకపోవచ్చు. దీంతో భాజపాకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. >> జనతాదళ్‌ సెక్యులర్‌, కాంగ్రెస్‌లు కలిసి తమకు మద్దతిస్తున్న సభ్యుల పేర్లను గవర్నర్‌కు సమర్పించవచ్చు. వాటిని పరిశీలించిన గవర్నర్‌ ప్రభుత్వ ఏర్పాటు చేయమని వీరిని కోరవచ్చు. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేయలేనని బీజేపీ తిరస్కరిస్తే తప్ప వీరికి అవకాశం రాదన్న అంశాన్ని వారు గుర్తించుకోవాలి.