యడ్యూరప్పకు ఢిల్లీ అధిష్టానం నుండి పిలుపు..

SMTV Desk 2018-05-15 16:35:50  karnataka elections, BS Yeddyurappa, jds party, bjp

బెంగళూరు, మే 15 : కన్నడ నాట ప్రధాన పార్టీలు ప్రభుత్వ ఏర్పాటుకోసం తీవ్రస్థాయిలో శ్రమిస్తున్నాయి. ఏ పార్టీకి స్వతహాగా అధికారం చేపట్టే అవకాశం లేకపోవడంతో జేడీఎస్‌ పార్టీ కీలకంగా మారింది. ఫలితాల్లో అత్యధికంగా బీజేపీ 104 స్థానాలు సాధించగా.. కాంగ్రెస్ 78, జేడీఎస్ 38, ఇతరులు 02 స్థానాలు దక్కించుకొన్నారు. ఓ వైపు కాంగ్రెస్ -జేడీఎస్‌ తో మంతనాలు చేస్తూ.. కుమారస్వామికి సీఎం పదవి ఆఫర్ చేసింది. ఈ నేపథ్యంలో భాజపా పార్లమెంటరీ పార్టీ ఢిల్లీలో భేటీ కానుంది. ఇప్పటికే కేంద్రమంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ బీజేపే జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా నివాసానికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఆ పార్టీ అధిష్టానం సీఎం అభ్యర్థి యడ్యూరప్పను ఢిల్లీకి రావాల్సిందిగా సూచించింది. జేడీఎస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే తాము సంపూర్ణంగా మద్దతు ఇస్తామని ఇప్పటికే కాంగ్రెస్‌ నిర్ణయం తీసుకోవడంతో బీజేపే భేటీ కీలకంగా మారింది. కర్ణాటకలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై యడ్యూరప్ప మాట్లాడుతూ.. ఇంకా పూర్తి ఫలితాలు రావాల్సి ఉందని, ప్రభుత్వ ఏర్పాటుకు ఉన్న అన్ని సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని వెల్లడించారు.