రసవత్తర కర్ణాటకం..

SMTV Desk 2018-05-15 15:56:45  #karnatakaelections, congress-jds, bjp, hung government

కర్ణాటక, మే 15 : కర్ణాటక లో రాజకీయం రసవత్తరంగా మారింది. తాజాగా వెలువడిన ఫలితాల్లో ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం రాకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటుకు జేడీఎస్ పార్టీ కీలకం కానుంది. ఫలితాల్లో అత్యధికంగా బీజేపీ 104 స్థానాలు సాధించగా.. కాంగ్రెస్ 78, జేడీఎస్ 38, ఇతరులు 02 స్థానాలు దక్కించుకొన్నారు. దీంతో ప్రభుత్వం ఏర్పాటుకు కమలం పార్టీ 8 స్థానాలతో మ్యాజిక్ ఫిగర్ కు దూరంగా ఉండి పోయింది. రెండోస్థానంలో ఉన్న కాంగ్రెస్‌..జేడీఎస్‌ తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. బీజేపీ అధికారంలోకి రాకుండా హస్తం పార్టీ తీవ్రంగా వ్యూహాలు రచిస్తుంది. కాంగ్రెస్‌ మాజీ అధినేత్రి సోనియా గాంధీ.. జేడీఎస్‌ కురువృద్ధుడు దేవేగౌడకు ఫోన్‌చేసి కలిసిపనిచేద్దామని కోరారు. ఇందుకు గౌడ కూడా సుముఖత వ్యక్తం చేశారు. ఇరుపార్టీల నేతలు కలిసి మంగళవారం సాయంత్రమే గవర్నర్‌ను కలవడానికి వెళ్లగా వారికి అనుమతి లభించలేదు. మరో వైపు బీజేపీ కూడా జేడీఎస్ తో చర్చలు జరిపేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇందుకోసం ఢిల్లీ నుండి ఆ పార్టీ పెద్దలు బెంగుళూరు చేరుకున్నారు. ఈ విషయంపై స్పందించాలని బీజేపీ కర్ణాటక ముఖ్యమంత్రి అభ్యర్థి యడ్యూరప్పను మీడియా కోరగా... కాంగ్రెస్‌-జేడీఎస్‌ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నాయన్న వార్తలపై ఇప్పుడేమి స్పందించానని అన్నారు.