కన్నడ నాట కాంగ్రెస్ షాక్..!

SMTV Desk 2018-05-15 12:38:23  #karnataka elections, congress, bjp, jds

కర్ణాటక, మే 15 : కర్ణాటకలో ప్రధాన జాతీయ పార్టీ కాంగ్రెస్ కు ఓటర్లు ఊహించని షాక్ ఇచ్చారు. మరో సారి అధికారం చేపట్టాలనే ఆ పార్టీకి కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యంగా దక్షణాదిన పాగా వేయాలన్న బీజేపీ పార్టీ తమ కలను నిజం చేసుకొంది. మోదీ, అమిత్ షా రాజకీయ వ్యూహాలు, చతురతను హస్తం పార్టీ నేతలు అంచనా వేయలేకపోయారు. 2008 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 110, కాంగ్రెస్ 80, జేడీఎస్ 28 స్థానాల్లో గెలుపొందాయి. 2013లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 122 స్థానాలు దక్కించుకోగా, బీజేపీ, జేడీఎస్ 40 స్థానాలకే మాత్రమే పరిమితమైంది. కర్ణాటకలో 1985 నుంచి ఏ పార్టీ రెండుసార్లు అధికారంలోకి వచ్చిన దాఖలాలు లేవు. ఆ సంప్రదాయం ఈసారి కూడా కొనసాగే దిశగా ఫలితాలు వస్తున్నాయి. రెండోసారి అధికారంలోకి రావాలనే సిద్ధరామయ్య ఆశలపై బీజేపీ నీళ్లు చల్లింది. ఒంటరిగానే ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన బలాన్ని బీజేపీ దాదాపు కైవసం చేసుకున్నట్టు తాజా ఫలితాలు చెబుతున్నాయి. తాజా ఫలితాల సరళి ప్రకారం బీజేపీ 111 నియోజకవర్గాల్లో, కాంగ్రెస్ 68 నియోజకవర్గాల్లో ముందంజలో ఉన్నాయి. జేడీఎస్ 40 సీట్ల ఆధిక్యంతో మూడో స్థానంలో నిలిచింది. ఇతరులు 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. ఆధిక్యాలన్నీ విజయంగా మారితే ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన 112 సీట్లను బీజేపీ సొంతంగానే దక్కించుని రాష్ట్రంలో తొలిసారి ఎకైక పెద్ద పార్టీగా నిలువబోతోంది. దీంతో బీజేపీ ఖాతాలోకి చేరిన 22వ రాష్ట్రం కర్ణాటక కాబోతోంది. ఇక్కడ విజయంతో భాజపా ఉత్తర భారతదేశ పార్టీ అనే అపోహ తొలిగిపోనుంది. అంతే కాకుండా దక్షిణాది రాష్ట్రాల్లో కాషాయ జెండా ఎగురవేయాలన్న కమలదళంకు ఈ గెలుపు తొలిమెట్టుగా పార్టీ నేతలు వర్ణిస్తున్నారు. త్వరలో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఫలితాలు బీజేపీ శ్రేణుల్లో మరింత నమ్మకాన్ని పెంచాయి.