కమలానిదే కర్ణాటక...!

SMTV Desk 2018-05-15 11:12:50  #karnatakaelections, bjp, congress, jds

బెంగుళూరు, మే 15 : కర్నాటక ఎన్నికల లెక్కింపులో బీజేపీ పార్టీ తన హవా కొనసాగిస్తుంది. దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్న కర్ణాటక ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. కట్టుదిట్టమైన భద్రత నడుమ 40 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. మే 12న జరిగిన 222 అసెంబ్లీ స్థానాల ఫలితాల లెక్కింపు కొనసాగుతుంది. సర్వేల అంచనాలను తలకిందులు చేస్తూ కాషాయదళం ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తుంది. తొలి గంటలో బీజేపీ, కాంగ్రెస్‌ హోరాహోరిగా పోటీ పడినా.. ఆ తర్వాత బీజేపీ ఒక్కసారిగా గేర్‌ మార్చి దూసుకుపోయింది. కాంగ్రెస్‌, జేడీఎస్‌.. భాజపా దరిదాపుల్లో కూడా లేకపోవడం గమనార్హం. ప్రస్తుతం భాజపా 111, కాంగ్రెస్‌ 64, జేడీఎస్‌ కూటమి 46 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. సెంట్రల్‌ కర్ణాటక, కోస్టల్‌ కర్ణాటక ప్రాంతాల్లో భాజపా ఏకపక్ష విజయం దిశగా పయనిస్తోంది. ముంబయి కర్ణాటక, , హైదరాబాద్‌ కర్ణాటక, బెంగళూరు సిటీలోనూ భాజపా హవా కొనసాగుతోంది. 224 నియోజకవర్గాలున్న కర్ణాటకలో అధికారం చేపట్టాలంటే 113 స్థానాలు గెలుచుకోవాల్సి ఉంది. భాజపా ఇప్పటికే 111 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతుండటంతో ఇక కన్నడ పీఠం భాజపాదే ఆ పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒకకవేళ మెజార్టీ తగ్గినప్పటికీ భాజపా అతిపెద్ద పార్టీగా అవతరించనుండటంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్‌ వారినే ఆహ్వానించే అవకాశం ఉంది. దీంతో కమలదళ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.