మీ ముందు ఓడిపోయాం... వచ్చే ఏడాది బలంగా వస్తాం..

SMTV Desk 2018-05-14 14:45:07  delhi daredevils, ddr ceoHemant Dua, ipl, gautam gambhir

ఢిల్లీ, మే 14 : ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ ... ఐపీఎల్ టోర్నీలో ఇప్పటివరకు కప్ ను అందుకోలేకపోయింది. ఈ సీజన్ లో కూడా ఆ జట్టుకు నిరాశే మిగిలింది. గౌతమ్ గంభీర్ సారథ్య బాధ్యతల నుండి తప్పుకున్నా, శ్రేయస్‌ అయ్యర్‌ జట్టు పగ్గాలు చేపట్టినా ఢిల్లీని అదృష్టం వరించలేదు. ఇప్పటివరకు ఆడిన 12 మ్యాచ్‌ల్లో కేవలం మూడింట్లో గెలిచి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. ఈ ఏడాది ఐపీఎల్‌లో ప్లేఆఫ్‌ అవకాశాలు కోల్పోయిన మొదటి జట్టుగా దిల్లీ డేర్‌డెవిల్స్‌ నిలిచింది. జట్టు పేలవ ప్రదర్శనపై ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ సీఈవో హేమంత్‌ దువా నిరాశతో ఉన్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..." ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ అభిమానులారా మరోసారి మీ ముందు ఓడిపోయాం. రిషబ్‌ పంత్‌, పృథ్వీ షా, శ్రేయస్‌ అయ్యర్‌ తదితర యువ ఆటగాళ్లు తమ సత్తా చాటారు. గాయాల కారణంగా క్రిస్ మెరిస్‌, కసిగో రబాడ దూరమయ్యారు. కొందరు సీనియర్‌ ఆటగాళ్లు తమ ఫామ్‌ను కోల్పోయారు. ఇది మాకు చాలా కఠినమైన ఏడాది. వచ్చే ఏడాది మరింత బలంగా మీ ముందుకు వస్తాం" అని దువా పేర్కొన్నారు.