ఖైరతాబాద్‌లో ఉద్రిక్తత..

SMTV Desk 2018-05-14 12:04:23  Former Home Guards protest, Khairatabad , home guards protest, hyderabad

హైదరాబాద్, మే 14‌: నగరంలోని ఖైరతాబాద్‌లో కొందరు హోంగార్డులు కుటుంబసభ్యులతో కలిసి మెరుపు ఆందోళనకు దిగారు. తమను ఉద్యోగాల నుంచి అకారణంగా తొలగించినందున కొందరు హోంగార్డులు హోర్డింగ్‌ ఎక్కి ఆందోళనకు దిగారు. దీని కారణంగా భారీ ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. బురన్‌గౌడ్‌ అనే హోంగార్డు ఖైరతాబాద్‌ చౌరస్తా సమీపంలోని హోర్డింగ్‌ పైకి ఎక్కాడు. దీంతో పరిస్థితి ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఉమ్మడి రాష్ట్రంలో అర్డర్‌ కాఫీలు లేవన్న కారణం చూపుతూ దాదాపు 350 మందిని ఉద్యోగాల నుంచి తొలగించారని హోంగార్డులు వాపోయారు. తమ ఉద్యోగ హామీ ఇచ్చేంత వరకూ ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు. ఖైరతాబాద్‌-నెక్లెస్‌ రోడ్డు, ఖైరతాబాద్‌-పంజాగుట్ట వరకూ వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోయాయి. తమకు స్పష్టమైన హామీ ఇచ్చేవరకు ఇక్కడి నుంచి వెళ్లేది లేదని వారు స్పష్టం చేశారు. బలవంతంగా తమను ఇక్కడి నుంచి తరలిస్తే.. ఇంటికి వెళ్లి కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు.