తమిళనాట 150 స్థానాల్లో తలైవా హవా..!

SMTV Desk 2018-05-14 11:26:43  rajni kanth, super star new party, aiadmk, dmk

చెన్నై, మే 14 : తమిళనాడులో రాజకీయ పరిస్థితులు ఏ క్షణం ఎలా ఉంటాయో తెలియదు. అన్నాడీఎంకే దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణం, డీఎంకే అధినేత కరుణానిధి అనారోగ్యం కారణంగా ఏర్పడిన రాజకీయ శూన్యతను కచ్చితంగా భర్తీ చేయగలనని సూపర్ స్టార్ రజనీకాంత్‌ విశ్వసిస్తున్నారని సమాచారం. అందుకు తగ్గట్టు తమిళనాడులోని అత్యధిక శాసనసభ నియోజకవర్గాల్లో రజనీకాంత్‌కు ఆకర్షణ ఉందని, ఈ మేరకు ఓ రహస్య సర్వే నిర్వహించి ప్రభుత్వానికి నిఘావర్గాలు నివేదిక పంపాయని ప్రచారం సాగుతోంది. ఇటీవల రజనీకాంత్‌ అమెరికాకు వెళ్లొచ్చిన విషయం తెలిసిందే. ఆ సమయంలో తమిళనాడులో ఆయనకు ప్రజామద్దతు ఎలా ఉందనే విషయాన్ని నిఘావర్గాలతో రాష్ట్ర ప్రభుత్వం రహస్య సర్వే చేయించిందని సమాచారం. రాష్ట్రంలోని 234 శాసనసభ నియోజకవర్గాల్లో 150 స్థానాల్లో ఆయనకు ప్రజామద్దతు ఉందనే విషయం వెలుగులోకి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నియోజకవర్గాల్లో రజనీకాంత్‌కు 35 నుంచి 40 శాతం మేరకు ఓటు బ్యాంకు సిద్ధమైందని తేలినట్లు వార్తలు వస్తున్నాయి. అందులో 15 శాతం దళితులు, 8 శాతం మైనారిటీలు, 15 శాతం ఇతర సామాజికవర్గం, రాజకీయ అసంతృప్తులు ఉన్నారని ప్రభుత్వానికి అందించిన నివేదికలో నిఘా వర్గాలు వెల్లడించాయని సమాచారం. దీంతో అధికార పార్టీ నేతలు సూపర్ స్టార్ రజనీ కాంత్ పై విమర్శల చేస్తున్నారు.