ఏపీ భూసేకరణ బిల్లుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..!

SMTV Desk 2018-05-12 16:22:01   ap land acquisition act 2013, central minister ravishankar prasad, anadhrapradesh, pmo office

న్యూఢిల్లీ, మే 12 : ఆంధ్రప్రదేశ్‌ భూసేకరణ చట్ట సవరణకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ అధికారులతో సంప్రదింపుల తర్వాత ఆమోద ముద్ర వేసినట్టు తెలిసింది. వెంటనే న్యాయశాఖ నుంచి సదరు దస్త్రాన్ని హోమంత్రిత్వ శాఖకు పంపించారట. రాష్ట్ర ప్రభుత్వం చేసిన పలు ప్రతిపాదనలకు మూడు రోజుల క్రితమే కేంద్ర న్యాయశాఖ ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. శుక్రవారం మధ్యాహ్నం హోంశాఖ కార్యదర్శి సంతకం చేసినట్టు వార్తలు వస్తున్నాయి. సోమవారం తర్వాత ఈ దస్త్రాన్ని ప్రధాని కార్యాలయానికి పంపి దీనిపై తుది నిర్ణయం తీసుకున్నాక రాష్ట్రపతి ఆమోదం కోసం పంపనున్నట్లు తెలుస్తోంది. ఈ వారంలో దాదాపు ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు ఆశాభావం వ్యక్తంచేస్తున్నాయి. హోంశాఖ కార్యదర్శి సంతకం ఇప్పటికే పూర్తవడం మిగతా ప్రక్రియంతా త్వరితగతిన పూర్తవుతుందని హోంశాఖ వర్గాలు భావిస్తున్నాయి. 2013 కొత్త భూసేకరణ చట్టానికి పలు సవరణలు చేస్తూ 2017 నవంబర్‌లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కొత్త బిల్లును తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అసెంబ్లీలో బిల్లును ఆమోదించి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతి ఆమోదానికి ఆ బిల్లును పంపింది.