రాయల్స్ రాజసం..

SMTV Desk 2018-05-12 11:23:40  rajastan royals, Jos Buttler, ipl, m.s.dhoni

జైపూర్, ‌మే 12 : సొంత గడ్డపై రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) రాజసం ప్రదర్శించింది. ఐపీఎల్ టోర్నీలో భాగంగా జైపూర్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో ఆర్ఆర్ జట్టు ప్లే ఆఫ్ ఆశలను సజీవం చేసుకుంది. చెన్నై నిర్దేశించిన 177 పరుగుల లక్ష్యాన్ని మరో బంతి మిగిలుండగానే ఛేదించింది. ముఖ్యంగా సూపర్‌ఫామ్‌లో రాజస్థాన్ ఆటగాడు జోస్‌ బట్లర్‌ (95 నాటౌట్‌; 60 బంతుల్లో 11×4, 2×6) మరోసారి గొప్ప ఇన్నింగ్ ఆడి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. అతనికి జతగా శాంసన్‌ (21), స్టువర్ట్‌ బిన్నీ (22) లు ఫర్వాలేదనిపించారు. తొలుత టాస్ నెగ్గి చెన్నై సారథి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. భారీ స్కోరు చేయడానికి మంచి పునాది పడినా.. ఆ జట్టు ఓ మోస్తరు స్కోరుతో సరిపెట్టుకుంది. బ్యాటింగ్ లో సురేష్ రైనా(52), వాట్సన్ (39), ధోని (33, నాటౌట్) రాణించారు. దీంతో సీఎస్ కే జట్టు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. రాజస్తాన్‌ రాయల్స్‌ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్‌ రెండు వికెట్లు తీయగా, ఇష్‌ సోథీకి ఓ వికెట్‌ దక్కింది. ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు జోస్ బట్లర్ కు దక్కింది.