కన్నడ రణం.. ముగిసిన ప్రచార పర్వం

SMTV Desk 2018-05-11 12:03:57  karnataka elections, bjp vs congress, jds, karnataka

కర్ణాటక, మే 11 : కన్నడనాట ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నో ప్రచార ర్యాలీలు.. మరెన్నో విమర్శల పర్వాలు.. ఇంకెన్నో హామీల జల్లుల మధ్య ఎట్టకేలకు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచార అంకానికి మే 10 సాయంత్రంతో తెర పడింది. రేపు జరగబోయే ఈ మహా సమరం కోసం అన్నిప్రధాన పార్టీలు ఇప్పటికే తమ వ్యూహాలతో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలు చేశాయి. రాష్ట్రంలో అధికారం నిలుపుకోవాలనే ఆరాటం కాంగ్రెస్ ది. ఎలాగైనా ఈ సారి సీఎం పీఠం దక్కించుకోవాలనే పోరాటం బీజేపీది. ఈ రెండింటికు పోటీగా అధికారం కోసం జేడీఎస్ పార్టీ. వెరసి ఈ త్రిముఖ వ్యూహం కోసం ఆయా పార్టీల నాయకులూ కర్ణాటకలో భారీ ఎత్తున ప్రచారం నిర్వహించారు. సుడిగాలి పర్యటనలు చేశారు. ఒకరిపై ఒకరు విమర్శల బాణాలను సంధించుకున్నారు. మే12న జరిగే ఎన్నికలకు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 58,000 పోలింగ్‌ కేంద్రాల్లో 600 కేంద్రాలను(పింక్‌ బూత్స్‌) పూర్తిగా మహిళలకే కేటాయించారు. మరో పదికి పైగా దివ్యాంగుల కోసం, 28 కేంద్రాలను ఇతర వ్యక్తుల కోసం కేటాయించారు. ఈ ఎన్నికల్లో 80,000 వీవీపాట్‌లు(ఓటర్‌ వెరిఫైడ్‌ ఆడిట్‌ ట్రయల్‌) యంత్రాలతో పాటు 80,000 ఈవీఎంలను ఉపయోగించనున్నారు. మొత్తం 224 సీట్లకు గాను ఒక స్థానంలో బీజేపీ అభ్యర్థి మరణంతో ఎన్నిక వాయిదా పడింది. శనివారం (మే12న) ఎన్నికలు జరగనుండగా.. మే 15న (మంగళవారం) ఫలితాలు వెలవడనున్నాయి.