హెలికాప్టర్‌ షాట్‌ కొట్టిన ఇషాన్..

SMTV Desk 2018-05-10 12:31:51  ishan kishan, kishan helicopter shot, mumbai indins, kkr, ipl

కోల్‌కతా, మే 10 : ఐపీఎల్ -11 సీజన్ లో భాగంగా డిపెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్ పై భారీ విజయాన్ని సాధించింది. కోల్‌కతా ముందు 211 పరుగుల భారీ లక్ష్యాన్ని నిలిపిన ముంబయి.. ప్రత్యర్థిని 108 పరుగులకే కుప్పకూల్చి, ఈ ఐపీఎల్‌లో పరుగుల పరంగా అత్యంత భారీ విజయాన్ని నమోదు చేసింది. వరుసగా మూడో విజయం సాధించిన ముంబయి.. నెట్‌రన్‌రేట్‌నూ భారీగా పెంచుకుని పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. ఈ మ్యాచ్ మొత్తానికి ముంబయి ఇండియన్స్‌ ఆటగాడు ఇషాన్‌ కిషన్‌ ఇన్నింగ్స్‌ హైలైట్. ముఖ్యంగా ఈ మ్యాచ్‌లో ఇషాన్‌ కొట్టిన ఓ షాట్‌ గురించి ప్రత్యేకంగా చర్చించుకుంటున్నారు. అదేంటంటే.. హెలికాప్టర్‌ షాట్‌. సాధారణంగా మన అందరికీ హెలికాప్టర్‌ షాట్‌ అంటే గుర్తుకు వచ్చేది మొదటగా మహేంద్ర సింగ్‌ ధోనీ మాత్రమే. ఈ మ్యాచ్‌లో ఇషాన్‌ కేవలం 21 బంతుల్లోనే 62 పరుగులు చేసి ముంబయి విజయంలో కీలకపాత్ర పోషించాడు. టోర్నీలో భాగంగా బుధవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 14వ ఓవర్లో కుల్‌దీప్‌ యాదవ్‌ వేసిన ఓ బంతిని ఇషాన్‌ సిక్స్‌గా మలిచాడు. ధోనీ హెలికాప్టర్‌ షాట్‌ ఎలా ఆడతాడో అచ్చు అలాగే ఇషాన్‌ ఈ సిక్స్‌ బాదాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది.