నేనైతే రహనే ను ఎంపిక చేస్తాను : దాదా

SMTV Desk 2018-05-09 16:31:33  Sourav Ganguly, Sourav Ganguly about rahane, bcci, rayudu

బెంగళూరు, మే 9 : రహానెను కేవలం టెస్ట్ మ్యాచ్‌కు పరిమితం చేసి ఇంగ్లాండ్‌తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌కు తీసుకోకపోవడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందని భారత మాజీ సారథి సౌరభ్‌ గంగూలీ పేర్కొన్నాడు. ఐపీఎల్‌ అనంతరం టీమ్‌ ఇండియా.. ఇంగ్లాండ్, ఐర్లాండ్‌తో వన్డే, టీ20 సిరీస్, అఫ్గానిస్థాన్‌తో ఒక టెస్ట్‌ మ్యాచ్‌ ఆడనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బీసీసీఐ ఈ సిరీస్‌కు సంబంధించి మంగళవారం జట్టుకు ఎంపికైన ఆటగాళ్ల జాబితాను వెల్లడించింది. ఐపీఎల్‌లో విశేషంగా రాణిస్తున్న అంబటి రాయుడు, కేఎల్‌ రాహుల్‌, కరుణ్‌ నాయర్‌, సిద్ధార్థ్‌ కౌల్‌.. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో జాతీయ జట్టుకు ఎంపికయ్యారు. ఇక వచ్చే నెల జూన్‌లో అఫ్గానిస్థాన్‌తో ఆడనున్న ఏకైక టెస్ట్‌కు అజింక్య రహానె సారథ్యం వహించనున్నాడు. దీనిపై స్పందించిన దాదా.." నేనైతే అంబటి రాయుడు స్థానంలో అజింక్య రహానెను ఇంగ్లాండ్‌ పర్యటనకు ఎంచుకుంటాను. ఇంగ్లాండ్‌ పిచ్‌లపై రహానెకు మంచి రికార్డు ఉంది. విదేశీ గడ్డపై అతను ఎప్పుడూ అత్యుత్తమ ఆటగాడే. అతనిని పరిమిత ఓవర్ల సిరీస్‌కు ఎంపిక చేయకపోవడం కఠిన నిర్ణయమే’ అని గంగూలీ వ్యాఖ్యానించాడు.