కర్ణాటకలో నకిలీ ఓటర్ ఐడీ కార్డులు కలకలం

SMTV Desk 2018-05-09 12:25:22  fake voter cards in karnataka, fake voter id, aslv apartment, karnataka elections

బెంగుళూరు, మే 9 : కర్ణాటకలో నకిలీ ఓటర్ ఐడీ కార్డులు బయటపడిన వ్యవహారం కలకలం రేపింది. మరో మూడు రోజుల్లో పోలింగ్‌ జరుగనున్న వేళ.. ఓ అపార్ట్‌మెంట్‌లో గుట్టలకొద్దీ ఓటర్‌ ఐడీ కార్డులు బయటపడ్డాయి. కొత్త ఓటర్ల ముసుగులో భారీ స్థాయిలో చీకటి వ్యవహారం నడుస్తున్నట్లు వెల్లడికావడంతో ఎన్నికల సంఘం అధికారులు అప్రమత్తమయ్యారు. ఉత్తర బెంగళూరులోని జాలహళ్లిలోగల ఎస్‌ఎల్వీ అపార్డ్‌మెంట్‌పై అధికారులు దాడిచేయగా.. వేలకొద్దీ ఓటర్‌ ఓటర్‌ ఐడీకార్డులు, అప్లికేషన్లు, ఐదు ల్యాప్‌టాప్‌లు, ఓ ప్రింటర్‌ లభ్యమయ్యాయి. అక్కడున్న సరంజామా చూసి అధికారులు సైతం షాకయ్యారు. సదరు ఐడీ కార్డులన్నీ బెంగళూరు రూరల్‌ పరిధిలోని రాజరాజేశ్వరి నగర్‌ (ఆర్‌ఆర్‌ నగర్‌) నియోజకవర్గానికి చెందిన ఓటర్లవిగా అధికారులు గుర్తించారు. ఇటీవల సవరించిన జాబితాలో.. ఈ నియోజకవర్గంలో కొత్తగా 10.3 శాతం ఓటర్లు చేరారు. దీంతో మొత్తం వ్యవహారంలో కుట్ర జరిగి ఉంటుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 24 గంటల్లోగా విచారణపూర్తిచేసి అన్ని వివరాలను వెల్లడిస్తామని ఎన్నికల ప్రధాన అధికారి సంజీవ్‌ కుమార్‌ మీడియాకు తెలిపారు.