మీతో కాకపోతే శ్రీలంకతో ఆడతాం : సీఏ

SMTV Desk 2018-05-08 14:00:16  cricket australia, day and night test, bcci vs ca, amitabh choudary

సిడ్నీ, మే 8 : ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియా పర్యటనలో టీమ్‌ఇండియా డే/నైట్‌ టెస్టు ఆడదని క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ)కు బీసీసీఐ స్పష్టం చేసింది. బీసీసీఐ నిర్ణయంతో డే/నైట్‌ టెస్టు నిర్వహించాలనుకున్న క్రికెట్‌ ఆస్ట్రేలియా ఆలోచనలకు ఫుల్‌స్టాప్‌ పడినట్లయింది. డే/నైట్‌ టెస్టు ఆడలేకపోవడానికి కారణాలు తెలుపుతూ..బీసీసీఐ కార్యదర్శి అమితాబ్‌ చౌదరి ఈ-మెయిల్‌ ద్వారా సీఏ సీఈఓ సదర్లాండ్‌కు పూర్తి వివరాలు తెలియజేశాడు. బీసీసీఐ ఈ-మెయిల్‌కు స్పందించిన సదర్లాండ్‌.."అడిలైడ్‌ వేదికగా డిసెంబర్‌ 6-10 తేదీల్లో భారత్‌, ఆస్ట్రేలియా మధ్య ప్రారంభమయ్యే టెస్ట్‌ షెడ్యూల్‌ ప్రకారం పగటి పూటే జరుగుతుందని" మంగళవారం పేర్కొన్నారు. అయితే టీమ్‌ఇండియా పర్యటన అనంతరం వచ్చే ఏడాది జనవరిలో శ్రీలంక జట్టు ఆసీస్‌ పర్యటనకు వెళ్లనుంది. ఈ క్రమంలో శ్రీలంకతో జరిగే బ్రిస్బేన్‌ టెస్ట్‌లోనైనా డే/టెస్ట్‌ ఆడాలనే ఆలోచనలో ఉన్నట్లు సదర్లాండ్‌ తెలిపాడు. "టెస్ట్‌ క్రికెట్ ప్రభావం కోల్పోకుండా స్వదేశీ గడ్డపై వేసవిలో ఆసీస్‌ ఆడే టెస్ట్‌ సిరీస్‌లో కనీసం ఒక్క టెస్ట్‌ అయినా డే/టెస్ట్‌ ఆడించాలని నిర్ణయించినట్లు" ఆయన చెప్పాడు.