బెంగుళూరుకు షాకిచ్చిన సన్ రైజర్స్..

SMTV Desk 2018-05-08 10:44:47  sun risers vs royal challengers bengalore, srh, ipl, kohli

హైదరాబాద్, మే 8 : సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మరోసారి బౌలింగ్ తో జట్టుకు విజయాన్ని అందించింది. ఉప్పల్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు తో రసవత్తరంగా జరిగిన మ్యాచ్ లో ఐదు పరుగుల తేడాతో రైజర్స్ జట్టు గెలుపొందింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో కోహ్లి సేన చివరిలో తడబాటుకు లోనయ్యి ప్లే ఆఫ్ అవకాశాలను కష్టతరం చేసుకుంది. తొలుత టాస్ నెగ్గిన బెంగుళూరు ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ కు దిగిన హైదరాబాద్ జట్టులో బ్యాట్స్ మెన్లు విఫలమయ్యారు. సారథి విలియమ్సన్‌ (56), షకిబ్ అల్ హసన్ (35) రాణించడంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌటైంది. ఆర్సీబీ జట్టులో పేసర్లు మహ్మద్‌ సిరాజ్‌ (3/25), సౌథీ (3/30) సన్‌రైజర్స్‌ను కట్టడి చేశారు. స్టార్ ఆటగాళ్ల ఉన్న బెంగుళూరు జట్టును హైదరాబాద్ జట్టు తమ బౌలింగ్ తో ముప్పతిప్పలు పెట్టింది. దీంతో ఆ జట్టు బెంగళూరు 20 ఓవర్లలో 6 వికెట్లకు 141 పరుగులు మాత్రమే చేయగలిగింది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి (39), గ్రాండ్‌హోమ్‌ (33) పోరాడిన జట్టును విజయాన్ని అందించలేకపోయారు. “మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్" అవార్డు కేన్ విలియమ్సన్‌కు దక్కింది.