ఈ రోజు భూమిపైకి సౌర తుపాను..!

SMTV Desk 2018-05-06 11:22:20  solar storm, partial tech block out, solar system, washington

వాషింగ్టన్, మే 6 ‌: ఈ రోజు భూమిపైకి తక్కువ తీవ్రత గల సౌర తుపాను ఆదివారం భూమిని తాకే అవకాశముందని పరిశోధకులు చెబుతున్నారు. దీని వల్ల స్వల్పకాలంపాటు ఉపగ్రహ ఆధారిత సేవలకు ఆటంకం ఏర్పడే అవకాశముందని సమాచారం. సూర్యుడి నుంచి భారీ స్థాయిలో కాస్మిక్‌ రేణువులు భూమివైపుగా వస్తున్నట్లు "స్పేస్‌ వెదర్‌" వెబ్‌సైట్‌ వెల్లడించింది. సూర్యుడి ఉపరితలంపై కనిపిస్తున్న ఓ భారీ రంధ్రం భూమి వైపుగా సౌర పవనాలను నెడుతోందని వెల్లడించింది. నాసా సోలార్‌ డైనమిక్స్‌ అబ్జర్వేటరీ తీసిన ఓ చిత్రాన్నీ పంచుకుంది. దీనిలో సూర్యుడి బాహ్య పొరలో ఓ రంధ్రం కనిపిస్తోంది. ఇక్కడి నుంచే సూర్యుడి అయస్కాంత క్షేత్రం తెరచుకుని భారీ పరిమాణంలో వాయువులు బయటకు వస్తాయి. మరోవైపు ఈ తుపానును స్వల్పతీవ్రత గల ‘జీ-1’గా నేషనల్‌ ఓసియానిక్‌ అండ్‌ అట్మాస్ఫిరిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎన్‌వోఏఏ) అంచనా వేసింది.