భువి లేకున్నా.. సన్ రైజర్స్ ఆదరగోడుతుంది : ఇర్ఫాన్‌ పఠాన్‌

SMTV Desk 2018-05-04 11:34:55  IRFAN PATHAN, BHUVANESHWAR KUMAR, SRH, SUN RISERS, SHAKIB AL HASAN

ముంబై, మే 4 : ఐపీఎల్ సీజన్-11 లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్ జట్టు స్వల్ప స్కోర్లను చేస్తూ మ్యాచ్ లను కాపాడుకుంటుంది. అందుకు కారణం ఆ జట్టు బౌలర్లు. బౌలింగ్ ప్రధానాస్త్రంగా ముందుకు సాగుతున్న సన్‌రైజర్స్‌ జట్టుని నిలవరించడం ఏ ప్రత్యర్ధి జట్టుకైనా కష్టమే. అయితే హైదరాబాద్ ప్రధాన బౌలర్ భువనేశ్వర్‌ లేకున్నా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బౌలింగ్‌ దళం అద్భుతంగా రాణిస్తోందని టీమ్‌ఇండియా మాజీ పేసర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ అంటున్నాడు. వెన్నెముక గాయం కారణంగా భువనేశ్వర్‌ మ్యాచ్‌లకు దూరమయ్యాడు. "ప్రధాన బౌలర్‌ భువనేశ్వర్‌ లేకున్నా సన్‌రైజర్స్‌ బౌలింగ్‌లో అదరగొడుతోంది. నా దృష్టిలో వన్డే క్రికెట్లో బుమ్రా జతకట్టేది భువనేశ్వర్‌తోనే. గత రెండు, మూడు మ్యాచ్‌ల్లో భువీ లేకున్నా సన్‌రైజర్స్‌ బౌలింగ్‌ అద్భుతంగా ఉంది. సిద్ధార్థ్‌ కౌల్‌, సందీప్‌ శర్మ ఉన్నప్పటికీ జట్టులో మంచి అంతర్జాతీయ పేసర్‌ లేడు. అయినా కూడా వాళ్లు గొప్పగా బౌలింగ్‌ చేస్తున్నారు. రషీద్‌ ఖాన్‌, షకీబ్‌ అల్‌ హసన్‌ విదేశీ ఆటగాళ్లే కానీ వాళ్లు స్పిన్నర్లు. పరిమిత వనరులను ఉపయోగించుకుంటూ ఈ యువ పేసర్లు సరైన ప్రదేశాల్లో బంతులేస్తున్నారు" అని పఠాన్‌ వ్యాఖ్యానించాడు.