విడుదలైన ఉపరాష్ట్రపతి ఎన్నిక నోటిఫికేషన్..

SMTV Desk 2017-07-06 18:47:17  Vice-presidential election notification, August 5th,Rajya Sabha Secretary General Shamsher Sharif, mp,Secretary Mukul Pandey ,US Secretary of State Rothas, Hamid Ansari

న్యూఢిల్లీ, జూలై 6 : భారత దేశ రాష్ట్రపతి ఎన్నికలతో పాటు ఉప రాష్ట్రపతి ఎన్నికలు కూడా దగ్గరకు వస్తున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ను కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం రోజున విడుదల చేసింది. ఆగష్టు 5న జరిగే ఈ ఎన్నికలకు జూలై 18వ తేదీన నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. నామినేషన్ చేసిన మరునాడు పరిశీలన జరుగుతుంది. ఈ నామినేషన్ల ఉపసంహరణకు చివరి గడువు ఈ నెల 21వ తేదీ. ఈ సారి ఉపరాష్ట్రపతి ఎన్నికలకు రాజ్యసభ సెక్రటరీ జనరల్ శంషేర్ షరీఫ్ రిటర్నింగ్ అధికారిగా, అదనపు కార్యదర్శి ముకుల్ పాండే, సంయుక్త కార్యదర్శి రోతాస్ సహాయ రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరించనున్నారు. ఉపరాష్ట్రపతిగా పోటీ చేసే అభ్యర్థికి విధిగా ఇరవై మంది ఎంపీలు ప్రతిపాదకులుగా, మరో ఇరవై మంది ఎంపీలు ద్వితీయ ప్రతిపాదకులుగాను సంతకాలు చేయాల్సి ఉంటుంది. ఈ ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపికకై కేవలం ఎంపీలు మాత్రమే ఓటర్లుగా ఉంటారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పార్లమెంట్ ప్రాంగణంలో ఓటింగ్ కొనసాగుతుంది. అదే రోజు రాత్రి ఫలితాలు విడుదలవుతాయి. రెండు పర్యాయాలు ఉపరాష్ట్రపతిగా వ్యవహరిస్తూ వస్తున్న హమీద్ అన్సారీ పదవి ఆగష్టు 10న ముగియనుంది. దేశంలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు వెంటవెంటనే జరగబోతున్నాయి.