తెలుగు తప్పనిసరి.. లేకపోతే జరిమానా

SMTV Desk 2018-05-02 18:42:32  telugu subject in telanagana, telangana education department, hyderabad, kadiam sri hari

హైదరాబాద్‌, మే 2 : రాష్ట్ర విద్యాశాఖ ఒకటి నుంచి పదో తరగతి వరకు బోధనలో తెలుగును ఒక అంశంగా అమలుచేయని ఆయా పాఠశాల యాజమాన్యాలపై జరిమానా విధించనుంది. తొలిసారి పట్టుబడితే రూ.50 వేలు, రెండోసారి అయితే రూ.లక్ష చొప్పున.. మూడోసారి దొరికితే పాఠశాల గుర్తింపు రద్దు చేసే విధంగా నిబంధనలు రూపొందించారు. తెలుగును తప్పనిసరి చేస్తూ రూపొందించిన చట్టం అమలు కోసం కమిటీ ఏర్పాటు చేశారు. తెలుగు అమలు చేయకుండా పట్టుబడితే వరుసగా రూ.50 వేలు, రూ.లక్ష జరిమానా విధించాలని కమిటీ ప్రతిపాదించింది. మూడోసారి మాత్రమే రద్దుకు సిఫార్సు చేస్తారు. ముసాయిదాను విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి మంగళవారం పంపారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పరిశీలన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌ పరిశీలనకు పంపనున్నారు. నిబంధనావళిపై ఆయన తుది నిర్ణయం తీసుకోనున్నారు. మరోవైపు పదో తరగతి వరకు తెలుగును తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్‌ జారీ చేసింది. ఈ చట్టం మే 2వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొంటూ విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్‌ ఆచార్య జీఓ జారీ విడుదల చేశారు.