రంగు మారుతున్న తాజ్.. ఆందోళన వ్యక్తం చేసిన సుప్రీం

SMTV Desk 2018-05-01 17:31:10  tajmahal pil, supreme court, deepak mishra, tajmahal

న్యూఢిల్లీ, మే 1 : ప్రపంచ ప్రసిద్ధి గాంచిన తాజ్ మహల్ రంగు మారడంపై సుప్రీం ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. పాలరాతితో కట్టిన తాజ్ మహల్ కాలుష్య భూతం కారణంగా క్రమంగా పసుపు రంగులోకి మారింది. అయితే ఇప్పుడు తాజాగా ముదురు గోధుమ, పచ్చరంగులోకి మారుతుండటంపై కేంద్రంపై ఆగ్రహం వ్యక్తి చేసింది. దేశవ్యాప్తంగా, విదేశాలనుంచి నిపుణులను పిలిపించి తాజ్‌ మహల్‌పై అధ్యయనం చేయాల్సిందిగా సూచించింది. దీనిపై జస్టిస్‌ ఎంబీ లోకూర్‌, జస్టిస్‌ దీపక్‌ గుప్తాల ద్విసభ్య ధర్మాసనం మాట్లాడుతూ.."మన వద్ద చారిత్రక కట్టడాలను పరిరక్షించే నైపుణ్యం ఉందో లేదో మాకు తెలియదు. ప్రపంచ వింతల్లో ఒకటిగా నిలిచిన, దేశం గర్వించదగ్గ కట్టడాల్లో ఒకటైన తాజ్‌ను పరిరక్షించుకోవడం మన బాధ్యత. తాజ్‌ రంగు ఎందుకు మారుతోంది? దీనిపై మీరు(కేంద్రం) ఏం చేస్తారో చేయండి. దానికి పూర్వ వైభవం తెప్పించాల్సిన బాధ్యత మీదే" అని పేర్కొన్నారు. తాజ్‌మహల్‌ను కాలుష్య కోరల నుంచి కాపాడాలని పర్యావరణవేత్త మెహతా సుప్రీంలో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ అంశంపై విచారణను మే 9కు వాయిదా వేస్తున్నట్టు సుప్రీం కోర్టు తెలిపింది.