బీజేపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి: రాహుల్‌

SMTV Desk 2018-04-29 16:37:32  Congress president rahul gandhi jan aakrosh rally in delhi ram leela ...

న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: ప్రజల కళ్లలో ప్రధాని మోదీపై ఆగ్రహం స్పష్టంగా కనిపిస్తోంది, బీజేపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అన్నారు. తప్పుడు హామీలతో దేశ ప్రజలను ప్రధాని మోదీ ఇంకా మభ్య పెట్టాలని చూస్తున్నారంటూ ఆయన ఆక్షేపించారు. ఆదివారం ఉదయం ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో కాంగ్రెస్‌ జన్‌ ఆక్రోశ్‌ ర్యాలీలో రాహుల్‌ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మోదీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. నేరస్థులకు టికెట్లు ఇచ్చిన ఘనత కూడా మోదీదే. జైలుకు వెళ్లిన వ్యక్తిని సీఎం అభ్యర్థిగా ప్రకటించారు. అమిత్‌ షా కుమారుడి ఆస్తులు కొన్ని నెలలో ఎలా రెట్టింపు అయ్యాయి? ప్రజలు బ్యాంకుల్లో దాచుకున్న సొమ్మును నీరవ్‌ మోదీ దోచుకెళ్లాడు. అయినా చౌకీ దార్‌(మోదీని ఉద్దేశించి) మాత్రం స్పందించరు. అవినీతిని అంతమొందిస్తానని ప్రతిజ్ఞ చేశారు. కానీ, రఫెల్‌ డీల్‌తో లక్షల కోట్ల అవినీతి జరిగింది. స్వయంగా మోదీనే అవినీతిని పెంచి పోషిస్తున్నారు అని రాహుల్‌ మండిపడ్డారు. వైషమ్యాలతో ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారు. మహిళలకు రక్షణ కరువైంది. నోట్ల రద్దు.. జీఎస్టీ అంటూ చెత్త నిర్ణయాలతో ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసేశారు. దేశ చరిత్రలో తొలిసారి సుప్రీం కోర్టు జడ్జిలు ఆరోపణలకు దిగారు. న్యాయవ్యవస్థలో సంక్షోభంపైనా మోదీ మౌనంగా ఉండటంలో అర్థమేంటి?. ఓవైపు సరిహద్దులో చైనా మనతో దుందుడుకు చర్యలకు దిగుంటే.. ఓ స్పష్టమైన ఎజెండా లేకుండా ఈయనగారు వెళ్లి చర్చలు జరుపుతున్నారు. మనకు ఎందరు దేవుళ్లున్నా.. సత్యం ముందు తలవంచక తప్పదు. అధికారం కోసం ఏనాడూ కాంగ్రెస్‌ వెంపర్లాడలేదు. ప్రతీ కార్యకర్త ఈ అవినీతి ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు ఉద్యమించాలి అని రాహుల్‌ పిలుపునిచ్చారు.