క్లాసులు నిర్వహిస్తే కాలేజీ గుర్తింపు రద్దు: ఇంటర్ బోర్డు

SMTV Desk 2018-04-29 10:51:42  Intermediate Board Secretary Ashok warnings to collages

హైదరాబాద్, ఏప్రిల్ 29 ‌: బోర్డు నిబంధనలను పాటించకుండా వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే అనుమతులు రద్దు చేస్తామని జూనియర్‌ కాలేజీ యాజమాన్యాలకు ఇంటర్మీడియెట్‌ బోర్డు స్పష్టం చేసింది. వివిధ జిల్లాల్లో తరగతులు నిర్వహిస్తున్న 396 కాలేజీలపై ఆకస్మిక దాడులు నిర్వహించామని పేర్కొంది. వాటికి ఇప్పటికే నోటీసులు జారీ చేశామని వివరించింది. ఇందులో హైదరాబాద్‌ జిల్లాలో 132, రంగారెడ్డి జిల్లాలో 91, మేడ్చల్‌ జిల్లాలో 173 కాలేజీలున్నాయని పేర్కొంది. కాలేజీ హాస్టళ్లు, నిర్వహణ తదితర అంశాలపై శనివారం ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో కార్యదర్శి అశోక్‌ మీడియాతో మాట్లాడారు. సెకండియర్‌ పూర్తయి ఎంసెట్, ఐఐటీకి సిద్ధమవుతున్న విద్యార్థులకు మాత్రమే తరగతులు నిర్వహించుకోవచ్చని తెలిపారు. ఫస్టియర్, సెకండియర్‌ విద్యార్థులకు సెలవుల్లో తరగతులు నిర్వహించే ప్రసక్తే లేదన్నారు. గుట్టుచప్పుడు కాకుండా తరగతులు నిర్వహిస్తే కాలేజీ అఫిలియేషన్‌ రద్దు చేస్తామని స్పష్టం చేశారు. జూనియర్‌ కాలేజీలకు సంబంధించి ప్రవేశాల నోటిఫికేషన్‌ జారీ చేసిన తర్వాతే అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించాలని బోర్డు కార్యదర్శి అశోక్‌ తెలిపారు. మే 21న ప్రవేశాల నోటిఫికేషన్‌ జారీ చేస్తామన్నారు. బోర్డు నుంచి అనుమతి పొందిన కాలేజీలు తమ అఫిలియేషన్‌ సర్టిఫికెట్‌ను కాలేజీ ప్రాంగణంలో ప్రదర్శించాలని స్పష్టం చేశారు.