హైదరాబాద్ లో ఆగని కల్తీ వ్యాపారుల ఆగడాలు

SMTV Desk 2017-07-06 15:57:14  food, paisan, adulteration, business

హైదరాబాద్, జూలై 6 ‌: ప్రతిరోజు మనం వాడుకునే నిత్యావసర వస్తువులపై కల్తీ వ్యాపారుల ఆగడాలను అధికారులు ఎంత అదుపు చేస్తున్నా, వారి అరాచకాలు మానట్లేదు అక్రమార్కులు. కల్తీ వస్తువులను తయారు చేస్తూ ప్రజలను అనారోగ్యాలపాలు చేస్తున్నారు. బుధవారం ఒక్కరోజే నగరంలో కల్తీ కేంద్రాలపై అధికారులు దాడి చేసి అధిక మొత్తంలో కల్తీ వస్తువులను స్వాధీనపరుచుకున్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులు, ఎస్‌ఓటీ పోలీసులు పూర్తిగా దాడులు నిర్వహించి కారం, పసుపు, ఆవాల పొడి, మసాలాల పెద్ద కల్తీ వ్యాపార గోభ్యాలను ప్రజలందరికి తెలియచేశారు. ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డి, సీఐ స్వామి, ఎస్‌ఓటీ సీఐ వెంకటేశ్వర్లు మొదలగువారు ఈ దాడిలో పాల్గొన్నారు. హైదరాబాద్‌కు చెందిన ఓ కల్తీ వ్యాపారవేత్త ఈదులకంటి పాండుగౌడ్‌ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం బొంగుళూరు గేట్‌ సమీపంలో భవానీ ఏజెన్సీస్‌ పేరిట కారం, పసుపు, ఆవాల పొడి, యాలకులు, ధనియాల పొడిని తయారుచేసే గోదామును నిర్వహిస్తున్నాడు. ఇక్కడ అధిక మొత్తంలో కల్తీ వస్తువులు తయారుచేస్తున్నారన్న విషయం తెలుసుకున్న పోలీసులు బుధవారం దాడులు చేశారు. పెద్దఎత్తున ఉత్పత్తి చేస్తున్న కల్తీ వస్తువులను స్వాధీనపరచుకున్నారు. కల్తీ వ్యాపారస్తులు నగరంలో ఉన్న కంపెనీ పేరున తయారు చేస్తున్న నిత్యావసర వస్తువులను, ఎవరికి ఎలాంటి అనుమానాలు రాకుండా పెద్ద ఎత్తున కల్తీవస్తువులు తయారుచేస్తున్నారు. మిర్చి కొనుగోలు కేంద్రాల వద్ద కిలో రూ.10కి దొరికే తెల్లగా పాలిపోయిన మిర్చిని తెచ్చి, వాటిని పొడిగా మార్చి ఎరుపు రంగు వచ్చేలా శుద్ధి చేయని వరిపొట్టు, నూనెతో కొత్త మిశ్రమం తయారు చేసి చెక్కపొట్టు కలుపుతున్నారు. దీంతో అది ఎర్రగా మారడంతో దాన్ని చక్రం బ్రాండ్‌ పేరిట ప్యాక్‌ చేసి కల్తీ వ్యాపారం జరుపుతున్నారని ఏసీపీ మల్లారెడ్డి తెలియజేశారు. యాలకులు,లవంగాలు, బోజ్‌వారీ ఆకుల వ్యర్థ పదార్దాలను పొడిగా చేసి ఆవాలు, ధనియాల్లో కలుపుతున్నారు. పోలిసుల చేతికి చిక్కిన కల్తీ వస్తువులను చూసి ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఈ కల్తీ వస్తువులు తయారుచేసే పరిశ్రమలో పనిచేసే అక్కడి కార్మికులు కుడా అక్కడ తయారుచేసే కారం, పసుపు, ధనియాల పొడి, ఆవాల పొడిని ఎప్పుడూ ఉపయోగించలేదని చెప్పడం ప్రజలను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. హైదరాబాద్ నగరంలోని బోరబండ సమీపంలో ఉన్న మధురానగర్‌లో కల్తీ అల్లం, వెల్లుల్లి మిశ్రమం తయారు చేస్తున్నట్లు సమాచారం అందుకున్న ఎస్సార్‌నగర్‌ పోలీసులు తయారీ కేంద్రంపై ఆకస్మికంగా దాడి చేశారు. ఆలుగడ్డలు, నూక పిండి, శనగపిండితో అల్లం, వెల్లుల్లి మిశ్రమాన్ని తయారు చేస్తున్న విషయం గుర్తించి నిందితుడు మహ్మద్‌ ముజాహిద్‌(46)ను అరెస్టు చేశారు. 100 కిలోల అల్లం, వెల్లుల్లి మిశ్రమంతో పాటు మరో 75 కిలోల కంటెనర్లను తమ ఆధీనంలోకి తీసుకున్నారు.