అఫ్గానిస్థాన్‌ ప్రతిపాదనకు నో చెప్పిన బీసీసీఐ..

SMTV Desk 2018-04-28 16:54:11  bcci, afganisthan cricket board, acb t-20 league, ipl

అఫ్గానిస్థాన్‌, ఏప్రిల్ 28 : టీ-20 టోర్నీలు వచ్చిన తర్వాత ప్రపంచ క్రికెట్ ముఖ చిత్రమే మారిపోయింది. ఇండియాలో జరిగే ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్‌) లాగే పాకిస్థాన్‌, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌తో పాటు పలు దేశాలు టీ20 టోర్నీలు నిర్వహిస్తున్నాయి. ఈ ఆదరణ చూసి తాజాగా ఐసీసీ టీ20లు ఆడే 102 దేశాలకు అంతర్జాతీయ హోదా కల్పించింది. తాజాగా అఫ్గానిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (ఏసీబీ) అక్టోబరు 5 నుంచి 24 వరకు షార్జా వేదికగా టీ20 లీగ్‌ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ లీగ్‌లో ఆడేందుకు భారత క్రికెటర్లకు బీసీసీఐ అనుమతి ఇవ్వాలని ఏసీబీ కోరింది. అయితే దీనికి బీసీసీఐ ఒప్పుకోలేదు. ఆటగాళ్లను ఆడేందుకు అనుమతి ఇవ్వని బీసీసీఐ.. ఆ దేశ బోర్డుకు ఎప్పుడూ అండగానే ఉంటామని చెప్పింది. "మా క్రికెటర్లు ఐపీఎల్‌ తప్ప ఏ టీ20 లీగ్‌లోనూ ఆడలేదు. ఇందుకు అనుమతి లేదు. మీ లీగ్‌లో ఆడేందుకు అనుమతి ఇస్తే మిగతా దేశాలు అడుగుతారు. ఇందుకు మేము సన్నద్ధంగా లేము. ఇప్పుడు ఎవరికైనా అనుమతి ఇస్తే... ప్రతి ఒక్కరికీ ఇవ్వాల్సి వస్తుంది" అని చెప్పినట్లు తెలుస్తోంది.