స్నేహ బంధం వైపు భారత్- చైనా...!

SMTV Desk 2018-04-28 13:52:16  india- china, modi-jinping, china, pakistan

వుహాన్, ఏప్రిల్ 28 ‌: భారత్- చైనాల మధ్య ప్రస్తుతం జరుగుతున్నా చర్చలు స్నేహబంధం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తున్నాయి. ప్రధాని మోదీ, చైనా అద్యక్షుడు జిన్‌పింగ్‌ మనసు విప్పి మాట్లాడుకునేందుకు సమావేశమయ్యారు. రెండు దేశాల బంధం మరింత బలోపేతమయ్యేలా స్నేహపూర్వకంగా మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా కొన్ని కీలక నిర్ణయాలకు ఇద్దరు నేతలూ అంగీకారం తెలిపినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. అఫ్గానిస్థాన్‌లో భారత్‌-చైనా సంయుక్తంగా ప్రాజెక్టును(ఇండియా-చైనా ఎకనమిక్‌ ప్రాజెక్టు) చేపట్టేందుకు భారత ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో జరిగే చర్చల్లో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన చర్యలపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇది కార్యరూపం దాల్చితే.. అఫ్గానిస్థాన్‌లో భారత్‌, చైనాలు సంయుక్తంగా చేపడుతున్న తొలి ప్రాజెక్టు ఇదే అవుతుంది. ఈ నిర్ణయంతో భారత్‌ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌కు షాక్ అనే చెప్పాలి. గత కొంతకాలంగా దాయాది దేశంకు చైనా వెనకుండి మద్దతిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చైనా-పాక్‌లు కలిసి ఎకనమిక్‌ కారిడార్‌(సీపెక్‌)ను కూడా ప్రారంభించాయి. దీన్ని అఫ్గానిస్థాన్‌కు కూడా విస్తరించాలని ఇరు దేశాలు భావించాయి. ఇప్పుడు భారత్‌తో కలిసి అఫ్గానిస్థాన్‌లో ప్రాజెక్టును చేపట్టేందుకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ అంగీకారం తెలిపారు.