హస్తకళల ప్రోత్సాహానికి కృషి: మంత్రి కేటీఆర్‌

SMTV Desk 2018-04-26 17:37:53  Centre and State collaboration to promote Handloom and Handicrafts in delhi

న్యూఢిల్లీ, ఏప్రిల్ 26 : ఢిల్లీలోని ఎన్‌డీఎంసీ కన్వెన్షన్ సెంటర్‌లో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ నేతృత్వంలో గురువారం అన్ని రాష్ర్టాల జౌళి శాఖ మంత్రుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ హస్తకళల ప్రోత్సాహానికి తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని వెల్లడించారు . జియోట్యాగింగ్ ద్వారా చేనేత మగ్గాలను గుర్తించి, వారి అభివృద్ధికి ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిందన్నారు. చేనేత పరిశ్రమ అభివృద్ధి కోసం తెలంగాణలో రెండు కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని చెప్పారు. దేశంలో ఎక్కడాలేని విధంగా నూలుకు, అద్దకాలకు సబ్సిడీ ఇస్తున్నట్లు చెప్పారు. చేనేత మగ్గాలు ఎక్కడున్నా వాటికి యూనిక్‌ కోడ్‌లు ఏర్పాటు చేశామన్నారు. చేనేత కార్మికులకు హెల్త్‌, లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ఇవ్వాలని మంత్రి కోరారు. తెలంగాణలో చేనేత క్లస్టర్స్‌ ఏర్పాటు చేయాలని కేటీఆర్‌ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.