టోల్ ఫ్రీ.. టోటల్ ఫ్రీ

SMTV Desk 2018-04-26 12:53:13  tollfree numbers, emergency toll free details, hyderabad, people problems issue

హైదరాబాద్, ఏప్రిల్ 26 ; ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసిన మహిళపై దాడులు, లైంగిక వేధింపులు తెగ పెరిగిపోతున్నాయి. ప్రజారక్షణ ప్రభుత్వాలకు ఒక విషమ పరీక్షగా మారింది. నేరాలు, ప్రమాదాలు, దాడులు ఇలా ఎన్నో సమాజాన్ని భయందోళనకు గురి చేస్తున్నాయి. వీటిలో ఏది జరిగిన తక్షణమే స్పందించేందుకు వీలుగా కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాసౌకర్యార్ధం ఎన్నో సేవలను ఉచితంగా అందిస్తున్నాయి. అవగాహన లోపంతో చాలా మందికి ఈ విషయాలు తెలియడం లేదు. ఇందులో సమాచారం అందించిన వ్యక్తి వివరాలు చాలా గోప్యంగా ఉంచబడతాయి. వీటికే కాకుండా విద్యుత్ అంతరాయలు, అగ్నిప్రమాదాలు, రైల్వే తదితర సామాజిక సమస్యలపై స్పందించడానికి ఆయా శాఖలు ఒక్కో టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశాయి. వాటి వివరాలు మీకోసం.. >> ఈవ్ టీజింగ్.. వరకట్న వేధింపులు.. 1091 ఎక్కడైనా ఆకతాయులు ఈవ్ టీజింగ్ కు పాల్పడిన, వరకట్నం పేరుతో ఇబ్బందులు పెట్టిన 1091 కు ఫోన్ చేసి రక్షణ పొందవచ్చు >> పిల్లలు తప్పిపోయిన.. వేధింపులకు గురైన..1098 ఆరు నుండి 14 ఏళ్ల పిల్లలపై వేధింపులు జరుగుతున్నాయా..? ఎక్కడైనా తప్పిపోయారా? ఇటువంటి వాటిపై 1098కు ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. >> లంచం అడిగితే.. 1064 ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం అడిగితే 1064 నెంబర్ కు ఫోన్ చేస్తే ఏసీబీ అధికారులు రంగంలోకి దిగుతారు. >> విద్యుత్ సమాచారం.. 1912 విద్యుత్ శాఖకు సంబంధించిన వివరాలను ఈ నెంబర్ ద్వారా తెలుసుకోవచ్చు. విద్యుత్ సరఫరాలో అంతరాయం, లో వోల్టేజి, సిబ్బంది తీరు, విద్యుత్ లైన్ల సమస్యపై ఫిర్యాదు చేయవచ్చు. ఇళ్ళలో విద్యుత్ పరికరాలు కాలిపోతూ ఆర్ధికంగా నష్టపోతున్నా, కరెంట్ బిల్లులో హెచ్చుతగ్గులు ఉన్న ఈ నెంబర్ ద్వారా సమాచారం తెలుసుకోవచ్చు >> మహిళలకు రక్షణకు.. 1090 సమాజంలో మహిళలు, యువతులు ఎదుర్కొంటున్న సమస్యలకు ఈ నెంబర్ కు ఫిర్యాదు చేయవచ్చు. గృహ హింస, అసభ్య ప్రవర్తనలపై కూడా ఫిర్యాదు చేయవచ్చు. బాల్యవివాహాలు, బాలికల నిర్బంధం, అక్రమమానవ రవాణా వంటి అంశాలపై నిర్భయంగా, నేరుగా అధికారుల దృష్టికి తీసుకువెళ్లవచ్చు. >> రైల్వే సమాచారం.. 139 రైల్వే సమాచారం ఏదైనా ఈ నెంబర్ ద్వారా క్షణాల్లో తెలుసుకోవచ్చు. రైళ్ల రాకపోకల సమయం, పీఎన్ఆర్ నెంబర్, రిజర్వేషన్, వెయిటింగ్ జాబితా, తదితర వివరాలు ఈ నెంబర్ ద్వారా తెలుసుకోవచ్చు. >> ఎక్సైజ్ శాఖ.. 18004252523 ఈ నెంబర్ ఎక్సైజ్ శాఖ శాఖకు సంబంధించింది. ఈ నెంబర్ కు ఫోన్ చేసి వైన్ షాపుల్లో మద్యం ఎక్కువ రేటుకు అమ్ముతున్నా, సమయానికి మించి మద్యం షాపులు తెరిచి ఉంచినా, బహిరంగంగా మద్యం సేవించిన, నకిలీ మద్యం తయారీ వివరాలు తెలియచేయవచ్చు. ఇవే కాకుండా అగ్నిప్రమాదాలకు 101, పోలీసు వ్యవస్థకు 100, అత్యవసర వైద్యసేవలు 108, వంటి ఉచిత సేవలు పౌరులకు అందుబాటులో ఉన్నాయి.