చిన్నారులకు ఆటోగ్రాఫ్ ఇచ్చిన విరాట్..

SMTV Desk 2018-04-25 17:45:45  virat kohli, kohli autograph to children, indian skipper, rcb

బెంగళూరు, ఏప్రిల్ 25 : విరాట్ కోహ్లి... ఇండియాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. టీమిండియా క్రికెట్ కెప్టెన్ గా, బ్యాట్స్ మెన్ గా ఎన్నో రికార్డులు తన వశం చేసుకున్నాడు. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు కోహ్లీ అంటే ఇష్టపడని వాళ్లు ఉండరు. ఐపీఎల్‌లో భాగంగా కోహ్లీ ప్రస్తుతం బెంగళూరులో ఉన్నాడు. ఈ నేపథ్యంలో నలుగురు చిన్నారి అభిమానులు కోహ్లీని కలిశారు. అనంతరం ఆ చిన్నారులకు తాను సంతకం చేసిన బ్యాట్‌లను బహుమతిగా ఇచ్చాడు. ఈ చిన్నారుల్లో ఒకడు ముంబయి ఇండియన్స్‌ జెర్సీ ధరించుకుని వచ్చాడు. కోహ్లీ పక్కనే ఉన్న ఒకరు ఆ చిన్నారిని నువ్వు ముంబయి ఇండియన్స్‌ అభిమానివా.. ఆర్‌సీబీ అభిమానివా అని ప్రశ్నించాడు. వెంటనే ఆ చిన్నారులంతా ఆర్‌సీబీ అనడంతో అక్కడున్న వారంతా నవ్వేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను కోహ్లీ తన ట్విటర్‌ ద్వారా అభిమానులతో షేర్ చేశాడు. ‘ఆత్మవిశ్వాసంతో ఉన్న ఇలాంటి చిన్నారులను కలవడం ఆనందంగా ఉంది’ అని వ్యాఖ్యానించాడు. లీగ్ లో భాగంగా ఈ రోజు కోహ్లి నాయకత్వం వహిస్తోన్న రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు - చెన్నై సూపర్‌ కింగ్స్‌ బెంగుళూరు వేదికగా తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌ కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే టికెట్లు హాట్ కేకుల్ల అమ్ముడుపోయాయని స్టేడియం అధికారులు తెలిపారు.